మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఫలించిన బీజేపీ వ్యూహం?

కలం, వెబ్ డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill) లోక్‌సభలో ఆమోదం పొందడం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రత్యేక సమావేశాల పేరుతో పార్లమెంటు ముందుకు తీసుకురావడం వెనక రాజకీయ కుట్ర ఉన్నదని విపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందో లేదోననే ఆందోళన ఎన్డీఏ కూటమి పార్టీల్లో నెలకొన్నది. ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం మొదలు దాని వెనక బీజేపీకి ఉన్న ఉద్దేశాన్ని విపక్షాలు తప్పుపట్టాయి. డీలిమిటేషన్ బిల్లుకు రాజముద్ర లభించేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును పావుగా వాడుకుంటున్నదని బీజేపీ కుట్రను విపక్షాలు ఎత్తిచూపాయి. ఈ బిల్లుపై ప్రధాని మోడీ (PM Modi), అమిత్ షా వివరణ ఇచ్చిన తర్వాత కూడా విపక్షాల సభ్యులు గురువారం అర్ధరాత్రి ఒంటిగంట వరకూ చర్చల్లో పాల్గొన్నారు.

విపక్షాలు అనుకూలంగా ఓటు వేయాలి :

మహిళా బిల్లుపై చర్చలు ముగింపు దశకు చేరుకుని ఓటింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో స్వయంగా ప్రధాని మోడీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. వేర్వేరు మెసేజ్‌ల ద్వారా విపక్ష పార్టీల ఎంపీలకు అప్పీల్ చేస్తున్నారు. మరోవైపు వివిధ ప్రాంతీయ పార్టీల నేతలను కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు ముఖాముఖి కలుసుకుని రిక్వెస్టు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేది ప్రశ్నార్థకం. కానీ విపక్షాల ఎంపీలకు మోడీ ఇచ్చిన సందేశం మాత్రం చర్చనీయాంశమైంది. ఆయన మెసేజ్‌లోని సారాంశం… “ప్రస్తుతం పార్లమెంటులో నారీశక్తి వందన్ అధినియం సవరణపై చర్చ జరుగుతోంది… నిన్న రాత్రి కూడా ఒంటి గంట వరకు ఈ చర్చ కొనసాగింది… అపోహలను తొలగించడానికి వివరణ ఇచ్చాం… అన్ని అనుమానాలను నివృత్తి చేశాం.. అవగాహన లేని సభ్యులందరికీ అర్థం చేయించాం… ఎవరి మనస్సులోనైనా వ్యతిరేకతకు సంబంధించిన అంశాలను పరిష్కరించాం…

దశాబ్దాల కలను సాకారం చేయండి :

“మహిళా రిజర్వేషన్ అంశంపై దేశంలో నాలుగు దశాబ్దాలుగా ఎంతో రాజకీయం జరిగింది… దేశంలోని సగం జనాభాకు వారి హక్కులు తప్పకుండా అందాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది… స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా, భారతీయ మహిళలకు నిర్ణయాధికార ప్రక్రియలో ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఉండటం సరికాదు… మరికొద్ది సేపట్లో లోక్‌సభలో ఓటింగ్ జరగనుంది… నేను అన్ని రాజకీయ పార్టీలకూ విజ్ఞప్తి చేస్తున్నాను… దయచేసి పూర్తి సున్నితత్వంతో, ఆలోచించి నిర్ణయం తీసుకోండి.. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయండి.. దేశంలోని నారీశక్తి తరపున సభ్యులందరినీ ప్రార్థిస్తున్నాను… నారీ శక్తి మనోభావాలు దెబ్బతినేలా ఎలాంటి పని చేయకండి… కోట్లాది మంది మహిళల దృష్టి మనందరిపై ఉన్నది.. దయచేసి నారీశక్తి వందన్ అధినియం సవరణకు మద్దతు ఇవ్వండి.” అని ప్రధాని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>