కలం, వెబ్ డెస్క్: యాసంగి పంటకు సంబంధించి తెలంగాణ నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ (Boiled Rice) సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ధాన్యం యాసంగి పంట బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలమని వారు కేంద్ర మంత్రికి తెలియజేశారు. గత ఆరు యాసంగి సీజన్లలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సరఫరా గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి జోషిని ఆయన నివాసంలో శుక్రవారం కలిశారు. దేశవ్యాప్తంగా బాయిల్డ్ రైస్‌కు భారీ డిమాండ్ ఉన్నందున సరఫరా పెంచాలని ఇటీవల కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రికి గుర్తుచేశారు. తెలంగాణలో ఈ యాసంగి సీజన్‌లో 90 ఎల్ఎంటీ ధాన్యం ఉత్పత్తి అవుతుందని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. తెలంగాణలో పండే యాసంగి ధాన్యం బాయిల్డ్ రైస్ మిల్లింగ్‌కు అనుకూలంగా ఉంటుందని కేంద్ర మంత్రికి రేవంత్ వివరించారు.
ఈ నేపథ్యంలో యాసంగి పంటకు సంబంధించిమొత్తం 30 ఎల్ఎంటీ బాయిల్డ్ రైస్ (5 శాతం నూకతో), 5 ఎల్ఎంటీ రా రైస్ (10 శాతం నూకతో) సరఫరా చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం (Revanth Reddy) కేంద్ర మంత్రికి తెలియజేశారు. బాయిల్డ్ రైస్ సరఫరాకు సంబంధించి చేసిన ప్రతిపాదనకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆమోదం తెలిపారు. 2014-15 వర్షాకాలం పంట అదనపు లెవీ సేకరణకు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విజ్ఞప్తి చేశారు. దేశంలోనే వరి ధాన్యం ఉత్పత్తి, సేకరణలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు తాము చెల్లింపులు చేస్తున్నామని కేంద్ర మంత్రికి సీఎం, రాష్ట్ర మంత్రి తెలియజేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మీద ఉన్న ఒత్తిడిని గుర్తించి వెంటనే పాత బకాయిలు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.
పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపాల నివారణకుగానూ పోషకాహార బియ్యాన్ని (FRK) పాఠశాలలు, వసతిగృహాలు, ఐసీడీఎస్‌ల పరిధిలో పంపిణీ చేసేవారని.. ఇటీవల దానిని నిలిపివేసినందున వెంటనే దానిని పునః ప్రారంభించాలని కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషిని కోరారు. ఈ సమావేశంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, సెక్రటరీ కోఆర్డినేషన్ అద్వైత్ సింగ్, కేంద్ర ఆహారం, ప్రజా పంపిణీ శాఖ అధికారులు పాల్గొన్నారు.
Read Also: మహిళా బిల్లుపై మోడీ భావోద్వేగ అప్పీల్
Follow Us On : WhatsApp

