కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను ఇండియా-పాకిస్థాన్ విభజనతో పోల్చి చూపుతూ కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్‌రావు (Ramchander Rao) సమర్ధించారు. తెలంగాణను తేజస్వి అవమానించలేదని అన్నారు. ఆయన మాట్లాడిన మాటల్లో తెలంగాణను అవమానించే వ్యాఖ్యలేవీ లేవని, కాంగ్రెస్ తీరునే ఆయన తప్పుపట్టారని వివరణ ఇచ్చారు. ఇండియా-పాకిస్థాన్ విభజన సమయంలో కాంగ్రెస్ పోషించిన పాత్రను గుర్తుచేస్తూ తెలంగాణ ఏర్పాటు గురించి ప్రస్తావించారని, కానీ తెలంగాణ సమాజాన్ని లేదా ఉద్యమాన్ని లేదా ప్రజలను లేదా ఆకాంక్షలను అవమానించలేదన్నారు. హిందీ భాష రాకపోతే నేర్చుకోవాలని, హిందీలో తేజస్వి చేసిన కామెంట్లను అర్థం చేయించుకోవాలని హితవు పలికారు. ఆయన మాటల్లో కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడమే ఉన్నది తప్ప తెలంగాణను అవమానించే కామెంట్లు లేవని కితాబునిచ్చారు.
తేజస్వి మాట్లాడింది ఇంగ్లీషులోనైనా..:
హిందీ భాష తెలియకపోవడం కారణంగానే తేజస్వి సూర్య స్పీచ్‌లోని భావం అర్థం కాలేదని, ఆయన కామెంట్లను తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు (Ramchander Rao) సమర్ధించుకున్నారు. నిజానికి తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటు గురించి లోక్‌సభలో గురువారం మాట్లాడింది ఇంగ్లీషులోనే. కానీ హిందీలో మాట్లాడినట్లుగా అవాస్తవాన్ని చెప్పి తెలంగాణ ప్రజలను రాంచందర్‌రావు తప్పుదోవ పట్టించారు. ఇండియా-పాకిస్తాన్ విభజనకంటే చెత్త తీరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విభజించినట్లు ఆయన ఇంగ్లీషులోనే వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల్లోని తెలంగాణ వ్యతిరేకతను ఖండించడానికి బదులుగా బీజేపీ ఎంపీ కావడంతో సమర్ధించుకోడానికి తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ అబద్ధాలను చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించారు.
Read Also: అణచివేత నుంచి అధికారం వైపు!
Follow Us On: X(Twitter)

