నిరుద్యోగి లేఖ సూసైడ్ నోట్ కాదు.. కాంగ్రెస్ ఛార్జ్ షీట్: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలో 2 లక్షల ఉద్యోగాలు రాలేదనే ఆవేదనతో వేణు కుమార్ అనే నిరుద్యోగ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం రాష్ట్రంలో నిరుద్యోగుల దుస్థితికి అద్దం పడుతోందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసినందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సదరు యువకుడు రాసిన లేఖ కేవలం సూసైడ్ నోట్ కాదని, అది కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి పక్కా ఛార్జ్ షీట్ అని కేటీఆర్ అన్నారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ ఆ యువకుడు తన ఆవేదనను వెళ్లగక్కాడని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులను ఉద్దేశించి ఎండ్రిన్ తాగి చావండి అంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతుంటే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని విద్యావంతులను, ఇంజినీర్లను ముఖ్యమంత్రి ‘క్రిమినల్ వేస్ట్’ అని సంబోధించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అమెరికా వంటి విదేశాల్లో మన ఐటీ నిపుణులు, ఇంజినీర్లు ప్రపంచాన్ని శాసిస్తుంటే, ఇక్కడి విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అనడం వారిని అవమానించడమేనన్నారు.

అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడమే నిజమైన క్రిమినల్ వేస్ట్ అని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి కలిసి పంచిన గ్యారెంటీ కార్డులు, 13 డిక్లరేషన్లు పూర్తిగా క్రిమినల్ వేస్ట్ అని కేటీఆర్ విమర్శించారు. కరువు పరిస్థితుల్లో వందల టీఎంసీల నీళ్లను వృధాగా కిందకు వదిలేయడం, ప్రగతి భవన్ అందుబాటులో ఉండగా కేవలం జూబ్లీహిల్స్ ప్యాలెస్ కోసం 200 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేయడం తీవ్రమైన నిర్లక్ష్యమని పేర్కొన్నారు. ఆలాగే 200 కోట్లతో అందాల పోటీలు నిర్వహించడం, మెస్సీతో ఫుట్‌బాల్ ఆడించడానికి 100 కోట్లు కేటాయించడం, కేసీఆర్ ను తిట్టడానికే ప్రజాధనంతో బహిరంగ సభలు పెట్టడం వంటివన్నీ క్రిమినల్ వేస్ట్ పనులని ఆరోపించారు. ఇంజినీర్లను ఇన్సల్ట్ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఎక్కడిదని ప్రశ్నిస్తూ, ఆయన కూడా కాపీ కొట్టే పాసై ఉంటాడంటూ కేటీఆర్ (KTR) విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>