కలం, వెబ్ డెస్క్: విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషిని నియమించడాన్ని కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కే (Abhijeet Dipke) తప్పుబట్టారు. ఆయన్ను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేదే మా ప్రధాన డిమాండ్. అది నెరవేరింది. మళ్లీ ఎవరికి ఇచ్చారు. బిల్కిస్ బానోపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులను సమర్థించిన ప్రహ్లాద్ జోషికి విద్యా శాఖ బాధ్యతలు అప్పగించారు. ఇలాంటి వారిని చూసినప్పుడు విద్యార్థినులకు ఎలా అనిపిస్తుంటుంది. అందుకే, అతను విద్యా మంత్రిగా ఉండటాన్ని మేం ఒప్పుకోవడం లేదు’ అన్నారు.
పరిహారం ఎప్పుడిస్తారు..?
నీట్ లీకేజీ కారణంగా చనిపోయిన విద్యార్థినుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని తాము ఆందోళన చేసినట్లు అభిజిత్ దీప్కే గుర్తు చేశారు. ‘కానీ, ఇంతవరకు కేంద్రం నుంచి వారికి ఎలాంటి డబ్బులు అందలేదు. నిబంధనలు పరిశీలిస్తున్నామని నాకు అధికారులు సమాచారం అందించారు. ఎంపీ, ఎమ్మెల్యేలను అక్రమంగా ఇతర పార్టీల నుంచి కొనుగోలు చేస్తున్నప్పుడు లేని నిబంధనలు.. పిల్లల కుటుంబాలను ఆదుకునే సమయంలోనే గుర్తొచ్చాయా..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

