Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో కాదు.. ఢిల్లీలోనే బీజేపీ యాత్రలు చేయాలి: వేముల వీరేశం

కలం, నల్లగొండ: తెలంగాణలో బీజేపీ చేపట్టిన ‘రైతు గోస – బీజేపీ భరోసా’ యాత్రపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. రైతుల పేరుతో బీజేపీ నేతలు రాజకీయం చేయడం మానుకోవాలని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే (Nakrekal MLA) వేముల వీరేశం (Vemula Veeresham) హితవు పలికారు. బీజేపీ నేతలు యాత్రలు చేయాల్సింది తెలంగాణలో కాదు, ఢిల్లీలో అని స్పష్టం చేశారు. తెలంగాణలో పండించిన ధాన్యం ఎంత? అందులో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది ఎంత? అనే విషయాలపై ముందుగా బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత సంవత్సరం తెలంగాణలో పండించిన మొత్తం పంటలను కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో లిఫ్ట్ (సేకరణ) చేసి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొన్నారు. రైతులకు కనీస మేలు చేయలేని బీజేపీ నేతలు, ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి లేనిపోని మాటలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఈ దేశంలో రైతులను అత్యధికంగా మోసం చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతులకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతులకు సంబంధించిన డబ్బులను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం హమాలీలు అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడక్కడా కొంత ఇబ్బంది ఎదురవుతున్న మాట వాస్తవమేనని, అయితే ఆ సమస్యలను సైతం ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తోందని వివరించారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా అక్కడక్కడా తడిసిన ధాన్యాన్ని సైతం మానవీయ కోణంలో ప్రభుత్వం కొనుగోలు చేసిందని, రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులకు భరోసా ఇచ్చారు. బీజేపీ పార్టీ రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు ‘బీ-టీమ్’ లా వ్యవహరిస్తోందని, ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా రైతుల పేరుతో ఇలాంటి పసలేని, పనికిమాలిన యాత్రలు చేయడం మానుకుని, క్షేత్రస్థాయిలో ఉన్న రైతాంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా బీజేపీ నేతలు చొరవ చూపాలని హితవు పలికారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>