Mobile Popup Ad
Mobile Popup Ad

నార్వే చెస్‌లో గుకేశ్ సంచలనం.. కార్ల్సెన్‌కు షాక్ ఓటమి

కలం, స్పోర్ట్స్ : నార్వే చెస్ (Norway Chess) టోర్నీలో తొలి రోజే భారీ సంచలనం నమోదైంది. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్సెన్ ఓటమి పాలవగా, భారత యువ గ్రాండ్‌మాస్టర్లు గుకేశ్, ప్రజ్ఞానంద అదిరిపోయే విజయాలతో మెరిశారు. చారిత్రాత్మక డైచ్‌మన్ బ్జోర్వికా లైబ్రరీలో టోర్నీ ప్రారంభమైంది. తొలి రౌండ్‌లో అందరి దృష్టి గుకేశ్-విన్సెంట్ కీమర్ మ్యాచ్‌పైనే నిలిచింది. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ పోరు 144 ఎత్తులతో ఉత్కంఠభరితంగా కొనసాగింది. క్లాసికల్ గేమ్ డ్రాగా ముగియడంతో ఆర్మగెడాన్ టైబ్రేక్ జరిగింది. అందులో గుకేశ్ కీలకమైన 15.Bh6 ఎత్తుతో విజయం అందుకున్నాడు. దీంతో గుకేశ్‌కు 1.5 పాయింట్లు లభించాయి.

మ్యాచ్ చివర్లో గుకేశ్ కాస్త ఒత్తిడికి లోనైనట్లు కనిపించింది. ఎత్తుల సంఖ్యపై అంపైర్‌ను కూడా అడిగాడు. అయినప్పటికీ టైబ్రేక్‌లో తేరుకుని గెలుపు సాధించాడు. కీమర్ మాత్రం మొత్తం క్లాసికల్ గేమ్‌లో ప్రశాంతంగా ఆడినప్పటికీ చివరికి ఓటమి తప్పలేదు. మరో భారత ఆటగాడు ఆర్ ప్రజ్ఞానంద కూడా ఆకట్టుకున్నాడు. అమెరికా గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సోతో జరిగిన క్లాసికల్ గేమ్ డ్రాగా ముగిసింది. తర్వాత జరిగిన ఆర్మగెడాన్ టై బ్రేక్‌లో ప్రజ్ఞానంద దూకుడు ప్రదర్శించి అదనపు పాయింట్ సాధించాడు.

అయితే రోజు మొత్తం చర్చనీయాంశంగా మారింది కార్ల్సెన్ ఓటమి. ఫ్రాన్స్‌కు చెందిన అలిరెజా ఫిరూజా ప్రపంచ నంబర్ వన్‌ను క్లాసికల్ చెస్‌లో ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇటీవల గాయంతో వీల్‌చైర్‌లో వచ్చిన ఫిరూజా, కాలికి ప్రత్యేక రక్షణతోనే బరిలోకి దిగాడు. అయినప్పటికీ అద్భుతమైన ఆత్మస్థైర్యంతో ఆడాడు. మ్యాచ్‌లో ఎక్కువసేపు కార్ల్సెన్ ఆధిపత్యంలో ఉన్నట్లు కనిపించింది. కానీ సమయ ఒత్తిడిలో చేసిన తప్పిదం మ్యాచ్‌ను మార్చేసింది. ఆ అవకాశాన్ని ఫిరూజా సరిగ్గా ఉపయోగించుకుని కీలక విజయాన్ని అందుకున్నాడు. ఈ గెలుపుతో అతడు మూడు పాయింట్లతో టోర్నీలో అగ్రస్థానానికి చేరాడు.

ప్రస్తుతం ఫిరూజా మూడు పాయింట్లతో ముందంజలో ఉన్నాడు. గుకేశ్, ప్రజ్ఞానంద చెరో 1.5 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. వెస్లీ సో, కీమర్ చెరో ఒక పాయింట్ సాధించగా, కార్ల్సెన్ ఖాతా ఇంకా తెరవలేదు. మహిళల విభాగంలో కూడా తొలి రోజే ఆసక్తికర ఫలితాలు వచ్చాయి. భారత నంబర్ వన్ హంపి కోనేరు పై కజకిస్తాన్ ఆటగాడు బిబిసారా అస్సౌబాయేవా క్లాసికల్ గేమ్‌లో విజయం సాధించింది. మధ్యభాగంలో వచ్చిన అవకాశాలను బిబిసారా సమర్థంగా వినియోగించుకుంది.

డిఫెండింగ్ ఛాంపియన్ అన్నా ముజిచుక్, జూ జినర్ మధ్య క్లాసికల్ గేమ్ డ్రాగా ముగిసింది. ఆర్మగెడాన్‌లో జూ జినర్ గెలిచి అదనపు పాయింట్ దక్కించుకుంది. మరోవైపు మహిళల ప్రపంచ ఛాంపియన్ జూ వెంజున్, భారత యువ ఆటగాడు దివ్యా దేశ్‌ముఖ్ మధ్య క్లాసికల్ పోరు సమంగా ముగిసింది. టైబ్రేక్‌లో దివ్యా అద్భుత ఆటతో విజయం సాధించింది. మొదటి రౌండ్ ముగిసే సరికి మహిళల విభాగంలో బిబిసారా అగ్రస్థానంలో ఉంది. దివ్యా దేశ్‌ముఖ్, జూ జినర్ చెరో 1.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. హంపి కోనేరు మాత్రం ఇంకా ఖాతా తెరవలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>