కలం, నల్లగొండ బ్యూరో: పాలకుల పరిహాసమో.. అధికారుల నిర్లక్ష్యమో.. కారణాలు ఏమైనా మునుగోడు (Munugode) ప్రాజెక్టులు కేవలం కాగితాలకే పరిమితమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణ వస్తే మా నీళ్లు మాకు వస్తాయని ఆశించిన మునుగోడు సామాన్య రైతాంగానికి ఇప్పుడు ‘టెక్నికల్ లెవల్స్’ పేరుతో జరుగుతున్న జల ద్రోహం అంతుచిక్కడం లేదు. రూ.వేల కోట్లు ఖర్చు చేసి కట్టిన రిజర్వాయర్లు కండ్ల ముందే ఉన్నా.. అధికారుల మొండి వైఖరి వల్ల ఎడారి దిబ్బల్లా మారబోతున్నాయి. మహబూబ్‌నగర్ ఇంజినీర్ల ‘ఎత్తు’గడలకు మునుగోడు ప్రయోజనాలు బలి కావడం ఖాయంగా కనిపిస్తోంది. వాస్తవంగా మునుగోడు సాగునీటి కల.. ఇంజినీర్ల ఫైళ్లలోనే సమాధి అవుతోందని చెప్పాలి. సాక్షాత్తు నీటి పారుదల శాఖ మంత్రి ఇచ్చిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కుట్రలు మునుగోడును మరోసారి ఎడారిగా మార్చే పరిస్థితి కన్పిస్తోంది. శ్రీశైలం నుంచి రావాల్సిన 2 టీఎంసీల నీటిని అర టీఎంసీకి కుదించి, నియోజకవర్గానికి నీరు అందకుండా చేస్తున్న ప్రయత్నాలపై మునుగోడు రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది.
437 మీటర్లు ఉంటేనే సాగునీటికి ఛాన్స్
డిండి (Dindi) ఎత్తిపోతల పథకం ద్వారా మునుగోడుకు నీరు అందాలంటే టెక్నికల్ లెవల్స్ చాలా కీలకం. ఇక్కడే అసలు రాజకీయం మొదలయ్యిందని చెప్పాలి. డిండి లిఫ్ట్ కింద ఉన్న చర్లగూడెం, శివన్నగూడెం తదితర ప్రాజెక్టులకు నీళ్లు రావాలంటే కాల్వలు 437 మీటర్ల ఎత్తులో ఉండాలి. అప్పుడే ఎదుల, వట్టెం రిజర్వాయర్ల నుండి నీటి మళ్లింపు సాధ్యమవుతుంది. కానీ మహబూబ్‌నగర్ ఈఎన్‌సీ మాత్రం 440 మీటర్ల ఎత్తుకు ఆమోదం తెలపడం మునుగోడు పాలిట శాపంగా మారింది. ఈ మూడు మీటర్ల వ్యత్యాసం వల్ల గ్రావిటీ ద్వారా రావాల్సిన నీరు ఆగిపోయి ప్రాజెక్టులు వెక్కిరించే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి శ్రీశైలం వద్ద కృష్ణా జలాలను మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు సమానంగా పంపిణీ చేయాలని గతంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే రోజుకు 2 టీఎంసీల చొప్పున నీటిని తరలించి మూడు జిల్లాలకు నీరందించాలి.
కానీ, మహబూబ్‌నగర్ జిల్లా ఇంజినీర్ల మొండివైఖరో.. పాలకుల కుట్రనో తెలియదు గానీ మునుగోడుకు రోజుకు అర టీఎంసీ నీరు మాత్రమే వచ్చే ఛాన్స్ ఉంది. రోజుకు ఒకటిన్నర టీఎంసీల నీటిని కోల్పోవడం అంటే మునుగోడు నియోజకవర్గంలోని వేలాది ఎకరాలను ఎడారిగా మార్చడమేనని చెప్పాలి. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశాల్లో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇంజనీర్లు పాత పద్ధతులనే అనుసరిస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. దీంతో ఒక జిల్లా ప్రయోజనాల కోసం మరో జిల్లాను బలిపశువును చేస్తున్నారా? అనే అనుమానాలు లేకపోలేదు. అయితే నల్లగొండ జిల్లాకు తీరని అన్యాయం జరుగుతున్నా.. స్థానిక నాయకత్వం గట్టిగా ప్రశ్నించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కలగానే శివన్నగూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్లు
రూ. వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్న శివన్నగూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్లు ఈ సాంకేతిక లోపాల వల్ల నీరు లేక ‘డెడ్ స్టోరేజ్’ కే పరిమితమయ్యేలా ఉన్నాయి. 437 మీటర్ల ఎత్తులో కాల్వలు నిర్మించకపోతే.. కృష్ణా నీరు మునుగోడు (Munugode) గడ్డను తాకడం అసాధ్యం. మునుగోడుకు జరుగుతున్న ఈ అన్యాయం కేవలం సాంకేతికమైనది కాదు.. ఇది వ్యవస్థాగతమైన నిర్లక్ష్యం. నాగార్జున సాగర్ కాల్వల విషయంలో గతంలో జరిగిన చారిత్రక తప్పిదమే ఇప్పుడు డిండి లిఫ్ట్ విషయంలోనూ పునరావృతమవుతోంది. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, ఇంజినీర్ల ‘ఎత్తు’గడలను అడ్డుకోకపోతే మునుగోడు (Munugode) ప్రజల ఆశలు శాశ్వతంగా గల్లంతయ్యే ప్రమాదం ఉంది.
Read Also: బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే.. కేటీఆర్, హరీశ్‌పై విప్ వేముల ఫైర్
Follow Us On : WhatsApp

