కలం, వెబ్ డెస్క్: ముంబై ఇండియన్స్ (Mumbai Indians) బ్యాటర్లు తడబడుతున్న వేళ నమన్ ధిర్ వీరోచిత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా వెరవకుండా ఆడిన నమన్ ధిర్ (57 పరుగులు, 37 బంతులు, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై బ్యాటర్లు భారీ స్కోర్లు చేయలేకపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ విల్ జాక్స్ (1) విఫలం కాగా, ర్యాన్ రికెల్టన్ 37 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఒక దశలో 59 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన జట్టును నమన్ ధిర్ తన క్లాస్ ఆటతీరుతో ముందుకు నడిపించాడు.
సూర్యకుమార్ యాదవ్ (21) మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. తిలక్ వర్మ (5), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (18) నిరాశపరిచారు. చివరలో ట్రెంట్ బౌల్ట్ ఒక సిక్సర్‌తో మెరవడంతో స్కోరు 150 దాటింది. బౌలింగ్ విషయానికొస్తే.. అన్షుల్ కంబోజ్ 3 వికెట్లతో ముంబై నడ్డి విరిచాడు. నూర్ అహ్మద్ తన స్పిన్ మాయాజాలంతో రెండు కీలక వికెట్లు పడగొట్టి ముంబైని కట్టడి చేశాడు. జేమీ ఓవర్టన్, రామకృష్ణ ఘోష్ తలో వికెట్ తీసి అతనికి సహకరించారు. ఇప్పుడు చెన్నై విజయానికి 160 పరుగులు చేయాల్సి ఉంది. పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తుండటంతో ఈ లక్ష్యాన్ని ఛేదించడం చెన్నైకి సవాలుగా మారే అవకాశం ఉంది.

