కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లా కుంటాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ (Pawar Ramarao Patel) మంగళవారం సందర్శించి పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రిన్సిపల్ రాజు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే స్వయంగా గంటకు పైగా పాఠశాల ఆవరణలో పర్యటిస్తూ సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు.
అనంతరం విద్యుత్ శాఖ అధికారులను పిలిపించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన నిధులను 48 గంటల్లో మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
దౌనెల్లిలో ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన ఎమ్మెల్యే..
కుంటాల మండలం దౌనెల్లి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ (Pawar Ramarao Patel) మంగళవారం ప్రారంభించారు. గ్రామానికి చెందిన షేక్ సుగురా భాను నూతన గృహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌తో పాటు గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Also: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ముంబై తాత స్టోరీ!
Follow Us On: X(Twitter)

