కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో లంబాడి హక్కుల పోరాట సమితి (Lambadi Hakkula Porata Samithi) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో లంబాడీలపై వివక్ష కొనసాగుతోందని సమితి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భరత్ చౌహన్ ఆరోపించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భరత్ చౌహన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడిచినా రైతుబంధు, రైతు రుణమాఫీ హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు.
ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులు ఎరువులు, విత్తనాల కొనుగోలు కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే రైతుబంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, లంబాడీలకు రైతు రుణమాఫీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో తాండాలు, గూడెంలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం వాటికి తగిన నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆరోపించారు.
సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్వహణతో పాటు ట్రాక్టర్ల డీజిల్ ఖర్చులు భరించలేక గ్రామ పంచాయతీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. కడెం మండలం బాబా నాయక్ తాండకు మంజూరైన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని అదే తాండాలో నిర్మించాలని, దానిని గిరిజనేతర గ్రామంలో నిర్మించే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు.
Read Also: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ముంబై తాత స్టోరీ!
Follow Us On: Instagram

