కలం, వెబ్ డెస్క్ : ”నా భర్తతో నేను కలిసి జీవించలేను.మా ఇద్దరి మధ్య వయసు తేడా నా వయసుకంటే ఎక్కువగా ఉంది. ఆయన నన్ను సరిగా చూసుకోవడం లేదు.తల్లిదండ్రుల దగ్గరికీ వెళ్లాలనుకోవడం లేదు. నాకు నచ్చిన వ్యక్తితోనే జీవిస్తాను” అని స్పష్టంగా తెలిపిన 19 ఏళ్ల వివాహితకు మధ్యప్రదేశ్ హైకోర్టు (MP High Court) బాసటగా నిలిచింది.
వివరాల్లోకి వెళ్తే.. నా భార్యను ఓ యువకుడు బలవంతంగా బంధించి ఉంచాడని ఆరోపిస్తూ 40 ఏళ్ల వ్యక్తి మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్‌లో ఇటీవల హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టుకు హాజరైన 19 ఏళ్ల వివాహిత.. విచారణ సందర్భంగా తాను కోరుకుంటున్న స్వేచ్ఛ ప్రస్తుతం తాను కలిసి ఉంటున్న వ్యక్తే ఇస్తున్నాడని ఆమె స్పష్టం చేసింది. తన క్షేమం దృష్ట్యా భర్త, పేరెంట్స్ వద్దకు తిరిగి వెళ్లానని చెప్పేసింది.
ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో యువతితో ప్రభుత్వ న్యాయవాది ప్రైవేట్‌గా మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత కూడా.. ఆమె తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దీంతో ఒక వ్యక్తి మేజర్ అయిన తర్వాత వారిని ఎవరూ బలవంతం చేయలేరని, చట్టబద్ధంగా వారికి నచ్చిన వారితో కలిసి ఉండే స్వేచ్ఛ ఉంటుందని ధర్మాసనం తేల్చి చెప్పింది. భర్త నుంచి విడిపోయి, తనకిష్టమైన భాగస్వామితో ఉంటానన్న ఆమె విన్నపాన్ని సమర్థించడం ద్వారా వ్యక్తిగత స్వేచ్ఛకు కోర్టు అత్యున్నత ప్రాధాన్యతనిచ్చింది. దీంతో భర్త దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ను గ్వాలియర్ బెంచ్ కొట్టివేసింది. అయితే ఆమె భద్రత దృష్ట్యా ఆరు నెలలపాటు ప్రభుత్వ సంరక్షణలో ఉంచాలని ఆదేశించింది.

