కలం, భువనగిరి: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, కార్మికులు ఎవరూ తొందరపడి ప్రాణాలు తీసుకోవద్దని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగి శంకర్ గౌడ్ మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులు ఎవరూ అధైర్యపడకూడదని, ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కావని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి వెనుక ఒక కుటుంబం ఉంటుందని, ప్రాణాలు ఎంతో విలువైనవని గుర్తుంచుకోవాలని కోరారు. ప్రజా పాలన సాగిస్తున్న ప్రస్తుత ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరిపేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
గత పాలకుల వలె చర్చల పేరుతో నెలల తరబడి సమయాన్ని వృథా చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వారి మాటలు నమ్మి ఆవేశానికి లోనుకావద్దని సూచించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే సమస్యను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారని ఎంపీ వెల్లడించారు. తక్షణమే ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెను విరమించి, ప్రభుత్వంతో చర్చల్లో పాల్గొనాలని ఆయన కోరారు. కార్మికుల న్యాయబద్ధమైన సమస్యలను ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని చామల కిరణ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.

