Mobile Popup Ad
Mobile Popup Ad

అప్పు చేస్తే తప్ప పాలన సాగేలా లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి

కలం, నల్లగొండ బ్యూరో: ఆర్టీసీ కార్మికులు సమ్మె సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) సూచించారు. శుక్రవారం నల్గొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికులు అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కోరారు. ప్రతి ప్రభుత్వ హయాంలోనూ సమస్యలు రావడం సహజమని, అయితే ప్రభుత్వం వాటిని శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, యాసంగి ధాన్యం కొనుగోళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను కోరారు. రైతు భరోసాను ఏకకాలంలో అమలు చేస్తేనే రైతులకు అసలైన ప్రయోజనం కలుగుతుందని, బోనస్ లేదా రైతు భరోసా.. ఏదో ఒక పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి రైతులకు ఉపశమనం కలిగించాలని పేర్కొన్నారు.

మన రాష్ట్రంలో పంట దిగుబడి పెరిగిందని, బాయిల్డ్ రైస్ సేకరణను పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం చేసిన విజ్ఞప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక స్థితి ఆశాజనకంగా లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా అప్పు పుడితే తప్ప వచ్చే మూడు నెలల పాటు పాలన సజావుగా సాగే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. రిటైర్డ్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారని, గత ప్రభుత్వం రిటైర్మెంట్ వయోపరిమితి పెంచడం కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికేనని ఆయన గుర్తు చేశారు. రాజకీయ పక్షాలు వాస్తవాలను విస్మరించి కేవలం విమర్శలు చేసుకోవడం వల్ల ప్రజలే నష్టపోతారని ఆయన హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తున్న పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమేనని కోర్టు స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. టెక్నికల్ అంశాలైన సెక్షన్ 8 కింద నోటీసుల విషయంలోనే కోర్టు మినహాయింపు ఇచ్చిందని, అది కేవలం సాంకేతిక అంశమే తప్ప కమిషన్ మనుగడపై కాదని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఆర్థిక భారంగా మారిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రభుత్వంలో లోపాలు ఉంటే ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలే తప్ప, ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో విమర్శించడం సరికాదని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>