కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ ఉదంతం (NEET Paper Leak Case)పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారాన్ని తాము సీరియస్‌గా పరిగణిస్తున్నామని స్పష్టం చేసిన ధర్మాసనం, భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండటానికి కఠినమైన చర్యలు అవసరమని పేర్కొంది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి సుప్రీంకోర్టు కీలక నోటీసులు జారీ చేసింది. నీట్ పరీక్షల నిర్వహణ తీరుపై, ముఖ్యంగా పేపర్ లీక్ ఘటన తర్వాత సంస్థాగతంగా చేపట్టిన సంస్కరణల పురోగతిపై సమగ్ర నివేదికను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎన్టీఏ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు, ఆ సంస్థలో తక్షణమే పటిష్టమైన సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది.
ఈ దర్యాప్తు ప్రక్రియను తాము నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తామని, పరీక్షల నిర్వహణకు సంబంధించి ఒక పటిష్టమైన, పారదర్శకమైన వ్యవస్థను రూపొందించే వరకు ఈ పర్యవేక్షణ కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోవైపు ఈ విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తన వాదనలను వినిపించింది. ప్రశ్నపత్రాల ముద్రణ దశ నుంచి మొదలుకొని, పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు చేరే వరకు జరిగే ప్రతి ప్రక్రియను అత్యంత పారదర్శకంగా న్యాయస్థానం ముందు ఉంచుతామని కేంద్రం తెలిపింది. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి, భవిష్యత్తులో ఎలాంటి పేపర్ లీకులకు ఆస్కారం లేకుండా చేయడానికి ఉన్నత స్థాయి పర్యవేక్షణలో అన్ని రకాల అదనపు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం కోర్టుకు (Supreme Court) వివరించింది.
Read Also: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. సోనమ్ వాంగ్ చుక్ కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

