కలం, వెబ్ డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌కు తెలంగాణ రాష్ట్రం మీద ఏ మాత్రం అవగాహన లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar) విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ, యూపీఏ ప్రభుత్వం వల్లే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ఈ విషయం అందరికీ తెలుసన్నారు. గూగుల్‌లో సెర్చ్ చేసినా.. ఏఐని అడిగినా ఇదే విషయం చెబుతుందన్నారు. కానీ నితిన్ నబిన్ మాత్రం తెలంగాణ రాష్ట్రం బీజేపీ వల్లే సాధ్యమైందని క్రెడిట్ కొట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందని కేసీఆర్‌కు కూడా నమ్మకం లేదన్నారు. ఆయన కేవలం కలెక్షన్లు, బై ఎలక్షన్లతో కాలక్షేపం చేశారని ఫైర్ అయ్యారు.
కిషన్ రెడ్డికి తెలంగాణకు ఏం చేశారు?
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం ఏం చేశారని చామల ప్రశ్నించారు. రాష్ట్రానికి ఒక్క రూపాయి అయినా నిధులు తీసుకొచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారిందని కిషన్ రెడ్డి ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ అప్పుల కుప్పగా చేసిందని ఫైర్ అయ్యారు. నెలకు రూ. 8 వేల కోట్ల రూపాయలు అప్పులకు వడ్డీ కడుతున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎన్నో అక్రమాలు జరిగాయని వాటి మీద కేంద్రం ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు.
కిషన్ రెడ్డిని తెలంగాణ సమాజం ఏనాడూ గుర్తించలేదు
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని తెలంగాణ సమాజం ఏనాడూ గుర్తించలేదని ఎంపీ ఫైర్ అయ్యారు. ఆయన తెలంగాణ కోసం ఏమీ చేయలేదని.. ఆ విషయం ప్రజలకు కూడా తెలుసన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో రూ. 66 లక్షల ఎకరాల్లో రైతులు వరిపంట సాగుచేశారని గుర్తు చేశారు. కానీ ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్రం జాప్యం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు చొరవ తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని.. కానీ తెలంగాణ రైతులు పండించిన ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు.

