తెలంగాణకు ఐఐఎం : కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM Telangana) మంజూరు చేసే ఆలోచన ఏదీ ప్రస్తుతానికి లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పింది. లోక్‌సభలో ఎంపీ డాక్టర్ మల్లు రవి అడిగిన అన్‌స్టార్డ్ ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తెలంగాణలో ఇప్పటికే అనేక ఉన్నత విద్యాసంస్థలు, మేనేజ్‌మెంట్ కాలేజీలు అందుబాటులో ఉన్నందున కొత్తగా ఐఐఎం ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా ప్రాంతీయ సమతుల్యత, వనరుల లభ్యతను బట్టి జాతీయ ప్రాధాన్యత కలిగిన విద్యాసంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి వివరించారు. ప్రస్తుతం దేశంలోని 21 రాష్ట్రాలలో మొత్తం 22 ఐఐఎంలు పనిచేస్తున్నాయని తెలిపారు. తెలంగాణతో పాటు గోవా, మణిపూర్, మిజోరాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలలో కూడా ఇప్పటివరకు ఐఐఎంలు లేవని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఐఐఎంను మంజూరు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి అభ్యర్థన వచ్చిన మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు.

అయితే, ఆలిండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ (AISHE) 2023-24 నివేదిక ప్రకారం తెలంగాణలో ఇప్పటికే 2,070 ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయని కేంద్రం గుర్తు చేసింది. వీటిలో 20 విశ్వవిద్యాలయాలు, 570 కళాశాలలు, 14 స్టాండ్‌అలోన్ ఇన్‌స్టిట్యూట్‌లతో కలిపి మొత్తం 604 విద్యాసంస్థలు మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్నాయని వివరించింది.

వీటికి తోడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఐఐటీ హైదరాబాద్, నిట్ వరంగల్, ఇఫ్లూ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు తెలంగాణలో సేవలందిస్తున్నాయని, 2023లో ములుగులో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశామని కేంద్ర ప్రభుత్వం తన సమాధానంలో వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>