కలం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రాన్ని కరువు కోరల్లో నుండి కాపాడి వెంటనే ప్రజలకు త్రాగు నీరు, సాగు నీరు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి (Chada Venkat Reddy) డిమాండ్ చేశారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. నీరు అనేది ప్రజల జీవితాలకి సంబంధించిన విషయం కాబట్టి తక్షణమే రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారని మండి పడ్డారు. తక్షణమే కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి వారి సహకారంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ దిగువ మానేరు జలాశయం నీరు కనిష్ఠ స్థాయికి పడిపోయి డ్యామ్ దౌర్బాగ్య స్థితిలో ఉందన్నారు.
వెంటనే ఎల్లంపల్లి మిడ్ మానేరు నుండి నీరు ఎల్ఎండీకీ వచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని చాడ అన్నారు. అలాగే నిన్న దేశ రాజధాని ఢిల్లీలో (CJP) కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు వేలాది మంది విద్యార్థులు యువకులు, మహిళలు వృద్దులు ఇలా విభిన్న వర్గాల వారు పార్లమెంట్ కు చేరుకోగా వారిపై ప్రభుత్వం లాఠీ ఛార్జ్, వాటర్ క్యాన్లు, పొగ బాంబులు వేసి విధ్వంసం సృష్టించారాని అన్నారు. కాని లక్షలాది జీవితాలతో ఆడుకున్న నీట్ పరీక్ష లీక్ కు కారణం అయిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే విషయం పై ప్రధాని మోదీ కనీసం నోరు మెదపక పోవడం పై సీపీఐ జాతీయ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

