Mobile Popup Ad
Mobile Popup Ad

ఆదిలాబాద్ అడవుల్లో మొర్రి పండ్ల మధురం

కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ (Adilabad) జిల్లా అటవీ ప్రాంతాలలో దొరికే మధురమైన మొర్రి పండ్లు(Morri Pandlu) ‘అమృత ఫలాలు’ గా పేరు పొందుతున్నాయి. వీటి తియ్యతనం, ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ప్రజలు ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. దట్టమైన అడవుల్లో పెరిగే ఈ మొర్రి పండ్లను గిరిజనులు ప్రతిరోజూ తెల్లవారుజామున అడవులకు వెళ్లి సేకరిస్తున్నారు. సేకరించిన పండ్లను రహదారి పక్కన, చౌరస్తాల్లో అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. ఒక చిన్న గ్లాసు మొర్రి పండ్లు రూ.50 వరకు అమ్ముతుండగా, కిలో ధర రూ.1000 వరకు ఉండటం గమనార్హం. అయినప్పటికీ ప్రజలు వెనక్కి తగ్గకుండా కొనుగోలు చేస్తున్నారు.

కొమరం భీం జిల్లా సరిహద్దులో, మహారాష్ట్రలోని అహేరి అటవీ ప్రాంతంలో ఈ పండ్లు ఎక్కువగా లభిస్తున్నాయి. దీంతో పెంచికల్‌పేట, కౌటాల, బెజ్జూర్, సిర్పూర్, దహేగాం మండలాల ప్రజలు అక్కడికి వెళ్లి మొర్రి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇక ఆదిలాబాద్, నిర్మల్ పట్టణాల్లో కూడా ఈ పండ్ల విక్రయం జోరుగా సాగుతోంది. చౌరాస్తాలలో, కూడళ్లలో గిరిజనులు మొర్రి పండ్లు విక్రయిస్తున్నారు. సీజనల్‌గా లభించే ఈ పండ్లు సహజసిద్ధంగా ఉండటంతో ప్రజలు ఎంతో ఇష్టంగా తీసుకుంటున్నారు.

మొర్రి పండ్లలో పుష్కలంగా పోషకాలు ఉండటంతో పాటు, ఎలాంటి రసాయనాలు లేకుండా సహజంగా పెరుగుతాయి. అందుకే ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రజలు భావిస్తున్నారు. వైద్యులు కూడా ఈ పండ్లను తీసుకోవాలని సూచిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ పండ్ల విక్రయంతో గిరిజనులకు రెండు నెలల పాటు ఉపాధి లభిస్తుండగా, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతోంది. దీంతో మొర్రి పండ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>