Mobile Popup Ad
Mobile Popup Ad

హర్మూజ్‌పై ఏం చేద్దాం.. ట్రంప్, మోడీ కీలక చర్చలు

కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు (Middle East Tensions), యుద్ధ భయాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత ప్రధాని మోదీ కీలక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సహకారంపై ఇరు దేశాధినేతలు ఫోన్‌లో సంభాషించుకున్నారు. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఇద్దరు నేతల మధ్య జరిగిన తొలి సంభాషణ ఇదే కావడం గమనార్హం.

40 నిమిషాల పాటూ..

దాదాపు 40 నిమిషాల పాటు కొనసాగిన ఈ చర్చలో పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులపైనే (Middle East Tensions) ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. ముఖ్యంగా Strait of Hormuz సముద్ర మార్గం నిరంతరం తెరిచి ఉండటంతో పాటు భద్రతా పరంగా సురక్షితంగా కొనసాగడం ప్రపంచానికి అత్యంత కీలకమని ఇద్దరు నేతలు చర్చించినట్టు సమాచారం. ఈ సంభాషణ అనంతరం ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, “నా మిత్రుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వివిధ రంగాల్లో భారత్, అమెరికా ద్వైపాక్షిక సహకారంలో సాధించిన గణనీయ పురోగతిని సమీక్షించాం. మా సమగ్ర గ్లోబల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అన్ని రంగాల్లో మరింత బలోపేతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. అలాగే పశ్చిమ ఆసియా పరిస్థితులపై చర్చించి, హర్మూజ్ జలసంధి తెరిచి, సురక్షితంగా ఉండాల్సిన అవసరాన్ని పునరుద్ఘాటించాం” అని పేర్కొన్నారు.

‘ఫలప్రదమైన చర్చలు జరిగాయి’

ఈ చర్చల అనంతరం భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ఈ సంభాషణను “చాలా సానుకూలంగా, ఫలప్రదంగా సాగింది” అని అభివర్ణించారు. “ఇద్దరు నేతలు కొన్ని నిమిషాల క్రితమే ఫోన్ సంభాషణ ముగించారు. పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలపై అధ్యక్షుడు ట్రంప్ వివరాలు ఇచ్చారు. అలాగే వాషింగ్టన్‌లో అమెరికా–భారత్ మధ్య జరుగుతున్న కీలక అంశాలపై కూడా చర్చించారు” అంటూ గోర్ ఓ మీడియా సంస్థకు తెలిపారు. మధ్యప్రాచ్య శాంతి ప్రక్రియలో భారత్ పాత్రపై ప్రశ్నించగా, న్యూఢిల్లీ భాగస్వామ్యాన్ని అమెరికా స్వాగతిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

రెండో దఫా చర్చలకు ప్రయత్నాలు

ప్రస్తుతం అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగుతోంది. పాకిస్థాన్‌లో ఇటీవల జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో రెండో దఫా చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇరాన్ హర్మూజ్ జలసంధిలో కొన్ని నౌకల రాకపోకలను అడ్డుకుంటున్న నేపథ్యంలో, అమెరికా తాజాగా ఇరాన్ పోర్టులపై నిర్బంధ చర్యలను అమలు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మోదీ–ట్రంప్ ఫోన్ సంభాషణకు ప్రాధాన్యత ఏర్పడింది. ఫిబ్రవరి 2న ఇరు దేశాధినేతల మధ్య సాగిన ఫోన్ సంభాషణలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద పురోగతిపై చర్చ జరిగింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>