కలం, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియా జట్టుపై భారత మాజీ ప్లేయర్ మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif) ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 2023 వరల్డ్ కప్‌లో ఆసీస్ గెలిచిందంటే.. అప్పుడు పాండ్యా లేకపోవడమే కారణమని అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో T20 వరల్డ్ కప్ 2026 నుంచి ఆసీస్ అనూహ్యంగా నిష్క్రమించడంపై కూడా కైఫ్ స్పందించాడు. 2023 వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా గ్రాఫ్ క్రమంగా పడిపోయిందని కైఫ్ పేర్కొన్నారు. 2024 టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ ఎయిట్స్‌లోనే బయటపడగా, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ ఓటమి, 2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ పరాజయం ఎదుర్కొన్నట్టు గుర్తు చేశారు.
అంతేకాదు, 2023 ఫైనల్‌లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఆడివుంటే ఫలితం వేరేలా ఉండేదని ఆయన (Mohammad Kaif) అభిప్రాయపడ్డారు. ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, ఇండియాపై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ టోర్నీలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సమయంలో హార్దిక్‌కు చీలమండ గాయం కావడంతో ఆయన బయటకు వెళ్లారు. అయినా భారత్ ఫైనల్ వరకూ అన్ని మ్యాచ్‌లు గెలిచింది. చివర్లో మాత్రమే ఆసీస్ చేతిలో ఓడింది.
ఇక ప్రస్తుత టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా ఆరంభంలో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత జింబాబ్వే చేతిలో 23 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దాంతో శ్రీలంకతో మ్యాచ్ తప్పనిసరి అయింది. మంచి స్టార్ట్ చేసినప్పటికీ చివరకు ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆపై జింబాబ్వే–ఐర్లాండ్ మ్యాచ్ రద్దు కావడంతో ఆసీస్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్–బీ నుంచి శ్రీలంక, జింబాబ్వే సూపర్ 8కు చేరాయి.
Read Also: సమీర్ రిజ్వీకి డీసీ కోచ్ హేమాంగ్ చురకలు.. క్యాంప్‌లో సరదా సీన్స్
Follow Us On: Sharechat

