కలం, కరీంనగర్: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై ఈనెల 27 నుండి ఉద్యోగ సంఘాల జేఏసీ చేపట్టిన పోరుబాటకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేసే యుద్దంలో బీజేపీ సైనికులే ముందుండి పోరాడేందుకు సిద్ధమన్నారు. ‘‘ఈ యుద్దంలో మీ కంటే ముందు మేమే ఉంటాం. పోలీసులు లాఠీఛార్జ్ చేస్తే ఆ దెబ్బలు మేమే తింటాం. తూటాలు పేలిస్తే ఆ తూటాలకు మేమే బలయ్యేందుకు సిద్ధం’’అని భరోసా ఇచ్చారు.
జేఏసీలో ఒకరిద్దరు నాయకులు ప్రభుత్వానికి అమ్ముడుపోయి ఉద్యమాన్ని వాయిదా వేయడం పరిపాటిగా మారిందని, అలాంటి వాళ్లను ఇకపై జేఏసీలో కొనసాగించవద్దని కోరారు. గత రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుండా తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు.
బుధవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఫొటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లను బండి సంజయ్ ఘనంగా సన్మానించారు. సమాజానికి ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం తదితరులతో కలిసి ఉద్యోగుల జేఏసీ పోరుబాటుకు మద్దతుగా మాట్లాడారు.
ఉద్యోగ సంఘాల జేఏసీకి సంఘీభావం..
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 27 నుండి పోరుబాటుకు కార్యాచరణ రూపొందించడాన్ని స్వాగతిస్తున్నామని బండి సంజయ్ అన్నారు. ఇన్నాళ్లకైనా ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు కళ్లు తెరిచి ఉద్యోగ, ఉపాధ్యాయులు పడుతున్నబాధలను గుర్తించి పోరుబాటకు సిద్ధమైనందుకు సంతోషంగా ఉందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ పక్షాన ఉద్యోగ సంఘాల జేఏసీకి సంఘీభావం ప్రకటిస్తున్నామని తెలిపారు.
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షన్ల పరిస్థితి దారుణంగా ఉందని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. పీఆర్సీని అమలు చేయడం లేదని.. హెల్త్ కార్డులు పని చేయడం లేదన్నారు. 6 డీఏలు పెండింగ్ లో ఉన్నాయని.. ఉద్యోగులకు రావాల్సిన దాదాపు 2 వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల బకాయిలు చెల్లించడం లేదని చెప్పారు. ఇప్పటికీ 317 జీవో బాధితులకు న్యాయం చేయలేదని.. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీసులను అమలు చేస్తామని ఇచ్చిన హామీని మర్చిపోయారని అన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను రద్దు చేసి పాత స్కీంను అమలు చేస్తామన్న హామీకి దిక్కు లేదన్నారు. వీటికోసం పైరవీలు చేస్తే సరిపోదు.. పోరాడితే సమస్యలు పరిష్కారమవుతాయని తాను మొదటి నుండి చెబుతూనే ఉన్నానని అన్నారు. కానీ రెండున్నరేళ్లుగా పట్టించుకోని జేఏసీ నాయకులు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ఉద్యమించేందుకు సిద్దం కావడం అబినందనీయమని పేర్కొన్నారు.
విద్యార్థుల పక్షాన యువ మోర్చా పోరాటం..
ఫీజు రీయంబర్స్ మెంట్ అమలు కోసం విద్యార్థుల పక్షాన యువ మోర్చా పోరాడుతోందని బండి సంజయ్ స్పష్టం చేశారు. గురువారం వేలాది మందితో కరీంనగర్ లో నిర్వహించే ఉద్యమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పాల్గొనబొతున్నారని ప్రకటించారు. “ఎందుకంటే ప్రభుత్వ పతనం ఉద్యోగ సంఘాల ఉద్యమాల నుండే మొదలవుతుంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలను ఉద్యమాలతో దించిన చరిత్ర జేఏసీకి ఉంది. ఉద్యోగ సంఘాల ఉద్యమ స్పూర్తితో రాష్ట్రంలో అన్ని సంఘాలు, నాయకులు, కవులు, కళాకారులు, కుల సంఘాలన్నీ ఏకమై కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీల పేరుతో చేసిన మోసాలపై ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. ఉద్యోగులు, ఉపాధ్యాయులతోపాటు ఇచ్చిన హామీల అమలు కోసం చేస్తున్న పోరాటాలకు బీజేపీ పూర్తి మద్దతివ్వడమే కాకుండా అవసరమైతే మీకు తోడుగా మేం కూడా ఉద్యమించేందుకు సిద్దంగా ఉన్నాం” అని అన్నారు.
కరీంనగర్ డెయిరీపై విజ్ఞప్తి..
కరీంనగర్ డెయిరీ విషయంలో రాజకీయ కోణంలో చూడొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. సాఫీగా సాగుతున్న కరీంనగర్ డెయిరీని దెబ్బతీసి వాళ్ల ఆస్తులపై కన్నేయడం సరికాదన్నారు. “లక్షలాది మంది రైతులకు మేలు చేసే సంస్థ. కక్ష సాధింపు చర్యలు సరికాదు. ఏదో ఒక పేరుతో బాగా నడిచే కరీంనగర్ డెయిరీని అప్రదిష్టపాల్జేసి రైతులకు అన్యాయం చేయాలని చూడటం దుర్మార్గం. ఒక వ్యక్తిని లక్ష్యం చేసుకుని వ్యవస్థను దెబ్బతీయడం దారణం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ప్రత్యేకంగా ఈ డెయిరీపై ద్రుష్టి పెట్టాలి. న్యాయం చేయాలి. ప్రభుత్వం పక్షాన సాయం చేయకపోయినా ఫరవాలేదు.. దయచేసి అన్యాయం చేయొద్దని కోరుతున్నా” అని విజ్ఞప్తి చేశారు.

