కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా దిలావర్‌పూర్ (Dilawarpur) మండలం న్యూలోలం గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఓవర్‌టేక్ చేసే క్రమంలో కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల కథనం ప్రకారం.. గుండంపెల్లి గ్రామం నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న కారును భైంసా నుంచి నిర్మల్ వైపు వస్తున్న మరో కారు ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించింది.
ఈ క్రమంలో ఎదురుగా నిర్మల్ నుంచి భైంసా వైపు వెళ్తున్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అదృష్టవశాత్తూ కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రమాదానికి గురైన లారీ రోడ్డుకు ఎడమ వైపునకు వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించారు.

