కలం, నిర్మల్ : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను (Kalyana Lakshmi, Shaadi Mubarak Schemes) యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా(BRS Protest) నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాంకిషన్ రెడ్డి మాట్లాడుతూ.. పేద కుటుంబాల ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నేత కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ పథకాల ద్వారా ఎంతోమంది పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిందని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమ పథకాలపై నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ఆరోపించారు.
కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను రద్దు చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. పేదలకు అండగా నిలిచే ఈ పథకాలను ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు. హామీల అమలు జరిగే వరకు బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని రాంకిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మంచాల శ్రీకాంత్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, మాజీ కౌన్సిలర్ అయ్యన్నగారి రాజేందర్, నాయకులు గండ్రత్ రమేష్, రిజ్వాన్ ఖాన్, హరీష్, మాజీ సర్పంచ్ సాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

