కలం, వెబ్‌డెస్క్: మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని గత డిసెంబర్‌లో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య (Gade Innaiah)కు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. గత డిసెంబర్‌లో అనారోగ్యంతో మృతి చెందిన మావోయిస్టు నేత వికల్ప్ అంత్యక్రియలకు ఇన్నయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మావోయిస్ట్ భావజాలాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్నాయంటూ ఎన్ఐఏ అధికారులు జనగామలోని జాఫర్‌ఘడ్‌లో ఆయన నిర్వహిస్తున్న ఆశ్రమంలో అరెస్ట్ చేశారు.
అరెస్ట్ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు రిమాండ్ విధించింది. గత డిసెంబర్‌లో ఇన్నయ్య అరెస్ట్ కాగా, జనవరిలో తన తల్లి మరణించడంతో బెయిల్‌పై విడుదలై అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఎనిమిది నెలల తర్వాత ఇన్నయ్యకు బెయిల్ లభించింది. ఈ బెయిల్‌పై కోర్టుల ఇన్నయ్యకు పలు షరతులు విధించింది. ప్రతి శుక్రవారం కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని ఆదేశించింది. రూ.25 వేల పూచీకత్తు చొప్పున రెండు బాండ్లు సమర్పించాలని పేర్కొంది. బుధవారం సాయంత్రం లోపు ఇన్నయ్య జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

