కలం, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఫ్రాన్స్ పర్యటన కొనసాగుతోంది. ఎవియాన్ నగరంలో జరుగుతున్న జీ7 సదస్సులో మోదీ పాల్గొంటున్నారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ, ట్రంప్ కలుసుకున్న వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీరిద్దరూ దాదాపు ఏడాది తర్వాత ఒకే వేదికపై కనిపించడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. గతేడాది ఫిబ్రవరిలో ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజులకే వాషింగ్టన్‌లోని వైట్ హౌస్‌లో వీరిద్దరూ కలుసుకున్నారు. ఇక జీ7 సదస్సు వేదికపై కాసేపు ముచ్చటించిన ఈ ఇద్దరు నేతలు బుధవారం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సదస్సు ముగింపులో జరగనున్న భారత్, అమెరికా ద్వైపాక్షిక చర్చలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
భారత్, అమెరికా సంబంధాల పరంగా ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గతేడాది భారత్‌పై అమెరికా విధించిన కొన్ని పన్నులు, భారత్, పాక్ సరిహద్దు ఘర్షణలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాలకు దారి తీశాయి. అలాగే ఇటీవల ఒమన్ తీరంలో ఒక వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించడంతో ఇరు దేశాల మధ్య కొంత ఉద్రిక్తత నెలకొంది. గత నెలలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా భారత్‌ను అమెరికాకు ఒక బలమైన మిత్ర దేశంగా అభివర్ణించడంతో ఇరు దేశాల సంబంధాలు తిరిగి గాడిన పడటం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీని ట్రంప్ తరఫున వైట్ హౌస్‌కు రూబియో ఆహ్వానించారు. ఈ జీ7 సదస్సు సందర్భంగా మోదీ మరి కొందరు ప్రపంచ దేశాల నేతలతోనూ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

