కలం, వెబ్ డెస్క్ : నైరుతి రుతుపవనాల కదలికలు మందగించడంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా మారింది. తెలంగాణ అంతటా రుతుపవనాలు ఇంకా విస్తరించకపోవడంతో ఎండల తీవ్రత కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటేస్తుండటంతో వాతావరణ శాఖ ఉత్తర తెలంగాణ జిల్లాలకు హీట్‌వేవ్ అలర్ట్ (Heatwave Alert) జారీ చేసింది. అయితే ఈ ఎండల తీవ్రత శాశ్వతం కాదని, మరో నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. దక్షిణ కోస్తాంధ్ర వరకు ఒక ద్రోణి విస్తరించి ఉండటంతో అక్కడ వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. నేడు ఏపీలోని పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక జారీ అయింది. ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోనూ వర్ష సూచన ఉంది. మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

