కలం, మెదక్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా యుద్ధాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరిగినా.. భారత్‌లో సామాన్యుడిపై భారం పడకుండా ప్రధాని మోడీ (Narendra Modi) ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తోందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి (MLC Anji Reddy) ప్రశంసించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా ఉందంటే అది మోడీ ప్రభుత్వం సాధించిన విజయమని కొనియాడారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించమని ప్రధాని మోడీ చెప్పిన మాటలను కాంగ్రెస్ నాయకులు వక్రీకరిస్తూ, తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
సంగారెడ్డి (Sangareddy) జిల్లా రామచంద్రపురంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి (MLC Anji Reddy) మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ ఉన్న సమయంలో దేశంలో ఆహార కొరత ఉన్నప్పుడు దక్షిణ భారతీయులు అన్నం, ఉత్తర భారతీయులు చపాతీలు తినడం తగ్గించాలని, ఫంక్షన్లకు దూరంగా ఉండాలని సూచించారు. మరో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో దేశ క్షేమం కోసం భారతీయులందరూ వారానికి ఒక పూట భోజనం మానేయాలని, ప్రతి సోమవారం ఉపవాసం ఉండాలని పిలుపునిచ్చినట్లు గుర్తుచేశారు. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1967లో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా దేశ ప్రజలు బంగారం కొనవద్దని ఆంక్షలు విధించారు. మన్మోహన్ సింగ్ ప్రధాని ఉన్న సమయంలో కూడా ఆర్థిక క్రమశిక్షణ పేరుతో సబ్సిడీలను తగ్గించాలని చెప్పలేదా? అని ప్రశ్నించారు.
నెహ్రూ ఆహారం తగ్గించమంటే దేశభక్తి అయినప్పుడు, మోడీ పర్యావరణం కోసం సోలార్ విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు వాడమనడం దేశ శ్రేయస్సు కాదా? అని నిలదీశారు. నాడు త్యాగాల పేరుతో దేశ ప్రజలకు కష్టాలు మిగిల్చింది కాంగ్రెస్.. నేడు ఆర్థిక సంస్కరణల పేరుతో సుస్థిర భవిష్యత్తును నిర్మిస్తోంది మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అన్నారు. విలాసాలు తగ్గించి, మెట్రో, ఎలక్ట్రిక్ వాహనాల వంటి ప్రజా రవాణాను ప్రోత్సహించడం ఆర్థిక క్రమశిక్షణే తప్ప, ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదన్నారు. మోడీపై అనవసరమైన విమర్శలు కాంగ్రెస్ నాయకుల ద్వంద్వ నీతికి నిదర్శనమని అంజిరెడ్డి ఫైరయ్యారు.
Read Also: షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం: ఈటల
Follow Us On: Instagram

