కలం, తెలంగాణ బ్యూరో : పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న చేవెళ్ళ, బాన్సువాడ ఎమ్మెల్యేలు కాలె యాదయ్య (Kale Yadaiah), పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivas Reddy) ఇప్పటికీ బీఆర్ఎస్‌తోనే ఉన్నారని, కాంగ్రెస్‌లో చేరలేదని, వారిపై అనర్హత వేటు వేయడం వీలుపడదని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ స్పష్టం చేశారు. న్యాయస్థానాల ఆదేశాలతో స్పీకర్ సుదీర్ఘ విచారణ జరిపి గతంలో ఐదుగురిపై అనర్హత వేటు వేయలేమని తీర్పు ఇచ్చారు. సంక్రాంతి పండుగ రోజే వీరిద్దరిపైనా తీర్పును వెలువరించారు. కాలె యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, వారు ఇప్పటికీ బీఆర్ఎస్‌తోనే ఉన్నారని తన తీర్పులో స్పష్టం చేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణ (MLAs Disqualification Case) ముగిసినట్లయింది. ఎవ్వరూ డిస్‌క్వాలిఫై కాలేదు.
త్వరలో మరో ముగ్గురిపై నిర్ణయం :
మొత్తం పదిమంది బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారని రాతపూర్వకంగా స్పీకర్ కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై విచారణ జరిపిన స్పీకర్ డిసెంబరు 17న ఐదుగురిపై తీర్పు ఇచ్చారు. వీరిపై అనర్హత వేటు వేయలేమని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే ఉన్నట్లు నొక్కిచెప్పారు. తాజాగా మరో ఇద్దరిపైనా అదే నిర్ణయాన్ని ప్రకటించారు. ఇక కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే), దానం నాగేందర్ (ఖైరతాబాద్ ఎమ్మెల్యే), డాక్టర్ సంజయ్ (జగిత్యాల ఎమ్మెల్యే) అనర్హత పిటిషన్లు విచారణ దశలో ఉన్నాయి. విచారణ జరిపిన అనంతరం స్పీకర్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వారంతా బీఆర్ఎస్‌తోనే ఉన్నట్లు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ పార్టీలో లేరని, కాంగ్రెస్‌తో ఉన్నారని అంటున్నారు.
డిస్‌క్వాలిఫై కాకుండా ఎమ్మెల్యేలుగా ఉన్నవారు :
1. అరికెపూడి గాంధి
2. ప్రకాశ్ గౌడ్
3. గూడెం మహిపాల్ రెడ్డి
4. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
5. తెల్లం వెంకటరావు
6. కాలె యాదయ్య
7. పోచారం శ్రీనివాసరెడ్డి

Read Also: బుల్లెట్ దిగుద్ది, జర జాగ్రత్త.. ట్రంప్‌కు ఇరాన్ వార్నింగ్
Follow Us On: X(Twitter)


