బాల్కొండలో రైతుల కష్టాలు.. ఎమ్మెల్యే వేముల ఫైర్!

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా బాల్కొండ నియోజక వర్గంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy) సందర్శించారు. రైతుల పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. భీంగల్ మండలం బడా భీంగల్, కమ్మర్‌పల్లి మండలంలోని బషీరాబాద్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా పరిశీలించారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కాక కల్లాల్లోనే కుప్పలు తెప్పలుగా పేరుకుపోవడం, అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతుండటంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే (MLA Vemula).. అక్కడి నుంచే కలెక్టర్‌, అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ప్రభుత్వం కొనుగోళ్లపై నిర్లక్ష్య వైఖరి అవలంబించడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. బడా భీంగల్‌లో 50 లారీల ధాన్యం నిల్వలు అప్పటికీ అక్కడే ఉన్నాయని అన్నారు. బషీరాబాద్‌లోనే దాదాపు 125 లారీలకు సరిపడా ధాన్యం నెల రోజులుగా కొనుగోలు కోసం ఎదురుచూస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాలు పడుతున్నప్పటికీ ప్రభుత్వం లారీలు, హమాలీలు, టార్పాలిన్ల వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడం రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.  ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కిలోల బస్తా తీసుకోవాల్సి ఉండగా, రైస్ మిల్లర్లు 43 నుంచి 44 కిలోల వరకు అడుగుతున్నారని రైతులు తన దృష్టికి తీసుకువచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. అంటే క్వింటాల్‌కు సుమారు 10 కిలోల వరకు ‘తరుగు’ పేరుతో ధాన్యం దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంట నాణ్యత బాగున్నా, ఎలాంటి తెగుళ్లు లేకున్నా రైతులను ఇబ్బంది పెట్టడం అన్యాయమని మండిపడ్డారు. ఇది బహిరంగ దోపిడీ అని, వెంటనే ఈ తరుగు అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి అని కలెక్టర్‌కు స్పష్టం చేసినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నేరుగా జిల్లా కలెక్టర్‌కు ఫోన్ ద్వారా వివరించారు. వెంటనే జిల్లా స్థాయిలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చెబుతున్నది ఒకటి.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉందన్నారు. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ అధికారులతో సమీక్ష జరిపి వెంటనే ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also: రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య.. నేపాల్‌కు తెలంగాణ పోలీసులు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>