నిజామాబాద్‌ సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో ప్రశ్నించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో :  తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా జీరో అవర్‌లో నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఇరిగేషన్ ప్రాజెక్టుల సమస్యలను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ప్యాకేజీ-21 పరిధిలోని చిట్టాపూర్, ఫతేపూర్, సుర్బిర్యాల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిచిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగమైన ప్యాకేజీలు 20, 21, 21A ద్వారా నిజామాబాద్ జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా బాల్కొండలో 70,000 ఎకరాలు, నిజామాబాద్ రూరల్‌లో 1,10,000 ఎకరాలు, కోరుట్లలో 19,000 ఎకరాలు, ఆర్మూర్‌లో 5,000 ఎకరాలకు నీరు అందించవచ్చని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం మొత్తం రూ. 4,800 కోట్లు కేటాయించగా, ఇప్పటికే రూ. 3,300 కోట్లు ఖర్చు చేసి సుమారు 70% పనులు పూర్తయ్యాయని గుర్తుచేశారు. మిగిలిన 30% పనులు పూర్తి చేస్తే 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.

మెట్‌పల్లి సెగ్మెంట్‌లోని ప్యాకేజీ 21Aలో ఇప్పటికే హెడ్‌వర్క్స్, పంప్‌హౌస్, మెయిన్ పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయని, సుమారు 80% పనులు ముగిశాయని చెప్పారు. కేవలం రూ. 500 కోట్లు ఖర్చు చేస్తే 1.20 లక్షల ఎకరాలకు 3 నుండి 6 నెలల్లో నీరు అందించవచ్చని, మరో రూ. 1000 కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన 80,000 ఎకరాలకు కూడా సాగునీరు అందించవచ్చని వివరించారు. ఇక చిట్టాపూర్–ఫతేపూర్–సుర్బిర్యాల్ లిఫ్ట్ ప్రాజెక్ట్ విషయానికొస్తే, గతంలో రూ. 150 కోట్ల అంచనాతో SRSP ద్వారా 9,274 ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో పనులు ప్రారంభించారని తెలిపారు.

ఇందులో బాల్కొండ ప్రాంతంలో 3,400 ఎకరాలకు, ఆర్మూర్ ప్రాంతంలో 5,700 ఎకరాలకు సాగునీరు అందేలా ప్రణాళిక రూపొందించారని చెప్పారు. అయితే గత రెండున్నర సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టుల పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలకు నీరు అందించే ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని, అవసరమైన నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే వేముల (Vemula Prashanth) డిమాండ్ చేశారు.

Read Also:  రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో పీఎం మోడీ కీలక మీటింగ్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>