కలం, మహబూబ్ నగర్ బ్యూరో: వనపర్తి (Wanaparthy) నియోజకవర్గంలో ప్రతి ఆడపడుచుకు నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (MLA Megha Reddy) అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక దాచే లక్ష్మయ్య ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన మహిళా వారోత్సవాల కార్యక్రమంలో మహిళలకు బ్యాంకు లింకేజీ చెక్కుల పంపిణీ, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన (MLA Megha Reddy) మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికై అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. డిసెంబర్ 7 2023న ప్రభుత్వం ఏర్పాటు అయినా వెంటనే మొదటగా రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం చేసేందుకు మొదటి సంతకం చేసిందన్నారు. ఆర్టీసీలో మహిళలు ఉచిత ప్రయాణానికి ఒక్క వనపర్తి జిల్లాలోనే ఇప్పటివరకు 30.29 కోట్ల రూపాయలు ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం ధర చెల్లించడం జరిగిందన్నారు.
ఆరోగ్య బీమాను 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచడం జరిగిందని, అదేవిధంగా జిల్లాలో 30 వేల తెల్ల రేషన్ కార్డులు కొత్తగా ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి తెల్ల రేషన్ కార్డు పై ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విద్యా వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిందని ప్రతి పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా ఏకరూప దుస్తులు, అల్పాహారం, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు 6000 మంది కొత్త టీచర్లకు నియామకం చేసినట్లు తెలిపారు.
జిల్లాలో 200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసినట్లు చెప్పారు. జిల్లాలో రూ. 207 కోట్ల వ్యయంతో 500 పడకల ఆసుపత్రి మంజూరీ చేసినట్లు చెప్పారు. ఐ.టి. టవర్, పాలిటెక్నిక్ కళాశాల భవనానికి పూర్వ వైభవం తీసుకురావడానికి 10 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. పట్టణంలో 70 కోట్ల రూపాయల వ్యయంతో సి.సి రోడ్లు వేయడం జరిగిందని, మరో 30 కోట్ల నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపించినట్లు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, అందుకే ఏ సంక్షేమ పథకం అయినా మహిళలే ప్రాతినిధ్యం వహించే విధంగా రూపకల్పన చేయడం జరుగుతుందన్నారు. త్వరలో వనపర్తి మహిళలకు డీజిల్ బంక్ మంజూరు కాబోతుందని, 546 ఇందిరమ్మ ఇళ్లు ఇప్పటికే మంజూరు అయ్యాయని, ప్లాట్లు లేని నిరుపేదలకు 1000 ప్లాట్లు మంజూరు చేసి అందులో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే విధంగా ప్రభుత్వానికి తాను ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఒక్క పూరి గుడిసె లేకుండా అన్ని పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రణాళికలు చేయడం జరిగిందన్నారు. ఇందిరమ్మ గృహ ప్రవేశానికి తన స్వంత డబ్బులతో లబ్ధిదారులకు పట్టు బట్టలు పెట్టీ గృహ ప్రవేశం చేయిస్తున్నట్లు తెలిపారు.
త్వరలోనే మహిళలకు సూపర్ మార్కెట్, రైస్ మిల్లు, గోదాములు నిర్మించుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మహిళలు ఆర్థిక సాధికారత సాధించేందుకు జిల్లాలో ఇప్పటి వరకు 83.76 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు ఇవ్వడం జరిగిందని, మొదటి విడతలో మహిళలకు ఉచితంగా 12669 ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తే ఇప్పుడు మలి విడతలో 15000 ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ లోకల్ బాడీ ఎన్. ఖీమ్య నాయక్ మాట్లాడుతూ మహిళల చేతుల్లో సంసారం ఉంటేనే కుటుంబం బాగుపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. అందుకే అన్ని సంక్షేమ పథకాలు మహిళలకే ఇస్తున్నట్టు చెప్పారు. వడ్డీలేని రుణాలు 5నుండి 10 లక్షలకు పెంచినట్లు వివరించారు. ప్రమాద వశాత్తూ సంఘంలో ఉన్న మహిళా చనిపోతే తీసుకున్న రుణం మొత్తం మాఫీ అయిపోయే విధంగా ప్రభుత్వమే బీమా చేసినట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, క్యాంటీన్లు, సోలార్ ప్లాంట్ , బస్సులు, గోదాములు అన్ని మహిళలకే ఇస్తున్నట్టు వివరించారు. ప్రభుత్వం మహిళలను ప్రోత్సహించి ఆర్థిక సాధికారతకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియజేశారు . వనపర్తి జిల్లాలో ఇప్పటికే 12 వేల పై చిలుకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగిందని, ఇప్పుడు రెండవసారి 15000 చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి రమేష్ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ పడుతుందని, మహిళలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యాపార వేత్తలుగా ఎదగాలను ఆకాంక్షించారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, కౌన్సిలర్లు సైతం మాట్లాడారు. మహిళలు పెద్దమొత్తంలో పాల్గొన్నారు. అనంతరం శాసన సభ్యుల చేతుల మీదుగా మహిళా సంఘాల సభ్యులకు రూ. 3.40 కోట్ల బ్యాంక్ లింకేజ్ చెక్కును, మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.
Read Also: బీజేపీ నేతలు రైతు గోస కాదు.. పెట్రోల్ గోస యాత్ర చేయాలి: పొన్నం
Follow Us On : WhatsApp

