కలం, నిర్మల్: భైంసా (Bhainsa) పట్టణంలోని గట్టు మైసమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గణేష్ నగర్, కిసాన్ గల్లీ, కోర్వ గల్లీతో పాటు పట్టణంలోని పలు కాలనీల నుంచి మహిళలు సాంప్రదాయ బోనాల కుండలతో, డప్పు చప్పుళ్ల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) గట్టు మైసమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని ఎమ్మెల్యే అమ్మవారిని ప్రార్థించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గట్టు మైసమ్మ ఆలయానికి వెళ్లే రహదారి నిర్మాణానికి రూ.65 లక్షల నిధులు మంజూరైనట్లు తెలిపారు. అలాగే భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో షెడ్ నిర్మాణం కోసం మరో రూ.10 లక్షల నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, బీజేపీ పట్టణ (Bhainsa) అధ్యక్షుడు రావుల రాము, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: నిర్మల్ జిల్లాలో ‘కారు’ స్టీరింగ్ పట్టేది ఎవరు?
Follow Us On : WhatsApp

