నిర్మల్ జిల్లాలో ‘కారు’ స్టీరింగ్ పట్టేది ఎవరు?

కలం, నిర్మల్: తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా పునర్నిర్మాణంపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, నిర్మల్ జిల్లాలో పార్టీ పగ్గాలు ఎవరి చేతికి వెళ్తాయన్న అంశం ఆసక్తికర చర్చకు దారితీసింది. జిల్లా అధ్యక్ష పదవిని (BRS Nirmal President) ఎవరికి అప్పగిస్తారనే దానిపై పార్టీ శ్రేణులతోపాటు రాజకీయ వర్గాల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతం నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జిగా రాంకిషన్ రెడ్డి, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా జాన్సన్ నాయక్, ముధోల్ నియోజకవర్గ సమన్వయకర్తలుగా డాక్టర్ పడకంటి, లోలం శ్యాంసుందర్, డాక్టర్ కిరణ్, విలాస్ గాదేవార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో నాయకత్వం ఉన్నప్పటికీ, జిల్లా స్థాయిలో పార్టీని సమన్వయం చేసే బలమైన నాయకత్వం అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అధికారం కోల్పోయాక డీలాపడ్డ క్యాడర్..

రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్‌కు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. పలువురు సీనియర్ నాయకులు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీ క్యాడర్ కొంత మేర నిస్తేజంగా మారింది. గతంలో చురుకుగా కనిపించిన పార్టీ కార్యక్రమాలు తగ్గిపోవడంతో కార్యకర్తల్లోనూ నిరుత్సాహం కనిపిస్తోంది.

అనిల్ జాదవ్‌దే కీలక పాత్ర..

జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు అధిష్ఠానం నుంచి ఆదేశాలు వచ్చినప్పుడల్లా ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ (MLA Anil Jadhav) సమన్వయ బాధ్యతలు చేపడుతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా నిర్మల్, బైంసా మున్సిపాలిటీల వ్యవహారాలకు ఆయనను ఇంచార్జిగా నియమించడం గమనార్హం. దీంతో జిల్లాలో పూర్తి స్థాయి నాయకత్వం అవసరమనే భావన మరింత బలపడింది.

జాన్సన్ నాయక్‌కు అవకాశమా?

బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఖానాపూర్ నియోజకవర్గ ఇంచార్జి జాన్సన్ నాయక్‌కు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యువ నాయకత్వం, పార్టీ కార్యక్రమాల్లో చురుకుదనం, అధిష్ఠానంతో సత్సంబంధాలు ఆయనకు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. అయితే జిల్లా అధ్యక్ష పదవి కోసం మాజీ జడ్పీ చైర్‌పర్సన్ విజయలక్ష్మి భర్త, ప్రస్తుత నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి రాంకిషన్ రెడ్డి పేరు కూడా బలంగా వినిపిస్తోంది. అలాగే మాజీ జడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ పేరు కూడా పార్టీ వర్గాల్లో చర్చకు వస్తోంది. వీరిద్దరూ సుదీర్ఘకాలంగా పార్టీతో అనుబంధం కలిగి ఉండటం, జిల్లాలో తమకంటూ ప్రత్యేక వర్గాన్ని కలిగి ఉండటం వారి బలంగా చెబుతున్నారు.

అప్పుడే జిల్లా అధ్యక్షుడి నియామకం?

గులాబీ పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టినప్పటికీ, రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ప్రారంభం కావడంతో సభ్యత్వ నమోదు తాత్కాలికంగా వాయిదా పడింది. వచ్చే నెలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేపట్టే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం గ్రామ, మండల స్థాయి అధ్యక్షుల నియామకాలను పూర్తి చేసి, జిల్లా అధ్యక్షుడి (BRS Nirmal President ) ఎంపికపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నాయకులు పేర్కొంటున్నారు. జిల్లా అధ్యక్ష పదవిపై ఇప్పటికే పలువురు సీనియర్ నాయకులు ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో గ్రామ, మండల కమిటీల ఏర్పాటు పూర్తయిన తర్వాతే జిల్లా అధ్యక్షుడి నియామకంపై స్పష్టత వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

గట్టి నాయకత్వం కోసం ఎదురుచూపులు..

ప్రస్తుతం బీఆర్ఎస్‌కు నిర్మల్ జిల్లాలో ప్రధాన సవాలు పార్టీ శ్రేణులను మళ్లీ ఒకే వేదికపైకి తీసుకురావడం. కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంతోపాటు, కాంగ్రెస్‌లోకి వెళ్లిన నాయకుల ప్రభావాన్ని ఎదుర్కొనేలా పార్టీని బలోపేతం చేసే నాయకుడినే జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని క్యాడర్ కోరుతోంది. తుది నిర్ణయం మాత్రం పార్టీ అధిష్ఠానం చేతుల్లోనే ఉంది. సంస్థాగత నియామకాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అప్పటి వరకు “నిర్మల్ జిల్లాలో కారు పార్టీకి స్టీరింగ్ పట్టేది ఎవరు?” అన్న ప్రశ్నకు సమాధానం కోసం రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Read Also: మహేశ్ టార్గెట్‌.. అర్బ‌న్ సీట్‌!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>