కలం, వెబ్ డెస్క్ : కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న జనసేనకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల తిరుపతి జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వ్యవహారం రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన ఓ రైల్వే మహిళా ఉద్యోగినిని బుట్టలో వేసుకుని పెళ్లి పేరుతో మోసం చేశారని బాధితురాలు ఆరోపించింది. తాజాగా జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి(Lokam Naga Madhavi)పై మనీ లాండరింగ్ నమోదైంది. 2024 ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే తన సంస్థ (మిరాకల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్) ద్వారా అక్రమంగా నగదును మళ్లించారని ఆరోపణ వచ్చాయి.
ఈ మేరకు ఆమె సంస్థలో పనిచేసి మానేసిన ఆనంద్ అనే మాజీ ఉద్యోగి, సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సుమారు 300 మంది ఉద్యోగుల ఖాతాల్లోకి 2024 జనవరి నుండి ఏప్రిల్ వరకు ప్రతి నెలా జీతంతో పాటు అదనంగా రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల వరకు జమ చేసినట్లు ఫిర్యాదు లో తెలిపారు. ఆ తర్వాత ఆ అదనపు మొత్తాన్ని ఎమ్మెల్యే మనుషులు తిరిగి నగదు రూపంలో వెనక్కి తీసుకుని, ఆ డబ్బును ఎన్నికల ఖర్చులకు ఉపయోగించారని పేర్కొన్నారు.
ఇక ఈ ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పందించింది. తక్షణమే విచారణ జరిపి సమగ్ర నివేదిక అందజేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో చూపించిన అధికారిక ఖర్చులకు, వాస్తవంగా జరిగిన ఖర్చులకు చాలా తేడా ఉందని .. ‘శాలరీ రౌండ్ ట్రిప్పింగ్’ ద్వారా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించింది. మానీలాండరింగ్ కేసుపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
Read Also: అమరావతి పునర్నిర్మాణం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Follow Us On : WhatsApp

