కలం, ఖమ్మం బ్యూరో : ఏజెన్సీ ప్రాంత ఎస్సీలది ధర్మపోరాటమని, దశాబ్దాలుగా సాగుతున్న వివక్షను అంతం చేసేందుకు, రాజ్యాంగ హక్కుల అమలు కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (MLA Kunamneni Sambasiva Rao) పిలుపునిచ్చారు. గురువారం కొత్తగూడెం పట్టణంలో షెడ్యూల్ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన ధర్మ పోరాట సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్సీలు సామాజికంగా, రాజకీయంగా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు లభిస్తున్న ఫలాలు, హక్కులకు ఎలాంటి భంగం కలిగించకుండానే, అదే ప్రాంతంలో తరతరాలుగా జీవిస్తున్న ఎస్సీలకు న్యాయం జరగాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని కూనంనేని స్పష్టం చేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీలు, ఎస్సీలు అనాదిగా సోదరభావంతో కలిసి మెలిసి ఉంటున్నారని, వారి మధ్య చిచ్చు పెట్టకుండా ఇరువురికి సమానమైన హక్కులు కల్పించేలా పాలకులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని (MLA Kunamneni) డిమాండ్ చేశారు. ఐదో షెడ్యూల్ సాకుతో ఎస్సీలకు కనీస రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేయడం సరికాదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వెసులుబాటు కల్పించాలన్నారు. అనాదిగా ఎస్సీల సాగులో ఉన్న భూములకు పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించాలని, జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో 20 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు.
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడవద్దని, అణగారిన వర్గాల అభివృద్ధికి బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలని హితవు పలికారు. ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీలకు ఇచ్చిన హామీలు అమలుచేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. ఏజెన్సీ ఎస్సీల ఆత్మగౌరవం చాటేలా ఈ పోరాటాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సభలో కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, జేఏసీ నాయకులూ బొమ్మెర శ్రీనివాస్, మద్దెల శివకుమార్, వేల్పుల భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
Read Also: కేసీఆర్ కాళ్లు పట్టుకొనైనా నీ అంతు చూస్తా.. అధికారికి పేర్ని నాని వార్నింగ్!
Follow Us On: Instagram

