కలం, నల్లగొండ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు కొత్తగా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తున్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) తెలిపారు. రాష్ట్రంలోని 3 కోట్ల 15 లక్షల మంది ప్రజలకు లాభం చేకూరేలా దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకం అమలు చేయనుందన్నారు. ప్రమాదంలో లేదా జబ్బులతో ఎవరైనా చనిపోతే ఇందిరమ్మ జీవిత బీమా అమలవుతుందని, ఏప్రిల్ ఒకటి నుండి ఈ పథకం ప్రారంభమైనట్లు చెప్పారు. గురువారం తిప్పర్తి మండల కేంద్రంలో రైతు వేదిక ఆవరణలో నిర్వహించిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు మంత్రి కోమటిరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాభివృద్ధిలో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలతో పాటు, తెలంగాణ మోడల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ పాఠశాలలకు విద్యార్థులను తీసుకెళ్లేందుకు బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎల్‌కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం అందించే కొత్త పథకాన్ని కూడా అమలు చేయనున్నామని ప్రకటించారు. దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలు అందిస్తున్నామన్నారు. రైతులు సేంద్రియ వ్యవసాయంతో పాటు, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మంత్రి కోరారు. మండలంలోని ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తున్నామన్నారు. రూ.6 కోట్లతో జూనియర్ కళాశాల, రూ.26 కోట్లతో ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేశామని.. ఇందుకు సంబంధించి జీవో త్వరలో రానుందని వెల్లడించారు.
15 రోజుల్లో టెండర్లు పిలిచి అన్ని సేవలు అందించేలా పీహెచ్‌సీని తీర్చిదిద్దుతామని చెప్పారు. అలాగే కనగల్ కు పీహెచ్‌సీని మంజూరు చేసినట్లు చెప్పారు. మండలంలో గతంలో 100 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేశామని, నిధులు లేనందున మధ్యలో నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. వాటికి నిధులు మంజూరు చేయిస్తామని, నెల రోజుల్లో గృహ ప్రవేశాలకు ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. 100 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గృహప్రవేశాల కోసం సొంతంగా ప్రతి ఇంటికి రూ.20వేలు ఇస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, సర్పంచ్ రజిత, స్థానిక సంస్థల ఇన్ చార్జ్ అదనపు కలెక్టర్ వై.అశోక్ రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: రికార్డు ధర పలికిన రవివర్మ పెయింటింగ్.. ఎన్ని కోట్లంటే..?
Follow Us On: X(Twitter)

