కలం, నేషనల్ డెస్క్ : Kerala Elections | తెలంగాణలో ఆరు గ్యారంటీల సక్సెస్ ఫార్ములాను కాంగ్రెస్ పార్టీ కేరళంలో ప్రయోగిస్తున్నది. ఐదు గ్యారంటీల (Indiramma Five Guarnatees) పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మేనిఫెస్టోను కేరళం కాంగ్రెస్ (Keralam PCC) పార్టీ విడుదల చేసింది. ఆరు గ్యారంటీలు ఎలా అమలవుతున్నాయో తెలంగాణకు వచ్చి చూసుకోవచ్చంటూ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కేరళం ప్రజలకు భరోసా కల్పించారు. ఇందిరమ్మ గ్యారంటీల పేరుతో కేరళం ప్రజలపై సంక్షేమ పథకాల జల్లును ప్రకటించింది. ఐదు గ్యారంటీలపై రాహుల్‌గాంధీ గత నెలలోనే కేరళం పర్యటన సందర్భంగా అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల క్యాంపెయిన్ ముమ్మరం కావడంతో మేనిఫెస్టో ద్వారా కేరళం పీసీసీ హామీలు కురిపించింది. తెలంగాణలో అమలవుతున్న నమూనాను కేరళం ప్రజలకు అర్థమయ్యేలా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం గమనార్హం.
ఆ ఐదు గ్యారంటీలు ఇవే :
పదేండ్లుగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ (LDF)కు ప్రధాన రాజకీయ ప్రత్యర్ధిగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) బరిలోకి దిగింది. ఈసారి అధికారంలోకి రావడానికి ఐదు గ్యారంటీలపై ఆశలు పెట్టుకున్నది. అలాంటి గ్యారంటీలు కేరళలో ఫస్ట్ టైమ్ కావడంతో గెలుపుపై కాంగ్రెస్‌కు నమ్మకాలు పెరిగాయి. మేనిఫెస్టోలో ఐదు గ్యారంటీలు మాత్రమే కాకుండా ఇంకా పలు హామీలను గుప్పించింది.
• రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
• కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు ప్రతి నెలా రూ. 1,000 చొప్పున అలవెన్స్
• మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ పేరుతో ప్రతీ కుటుంబానికి రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం
• సొంత వ్యాపారాలు ప్రారంభించే యువతకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
• సామాజిక భద్రతా పెన్షన్లను రూ. 3,000కి పెంపు
ఇవి కాక మేనిఫెస్టోలో పేద కుటుంబాలకు ఉచితంగా డయాలసిస్ సేవలు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక ‘షీ’ (SHE) ఆసుపత్రులు. గిరిజన ఆవాసాలు, తీరప్రాంతాల్లో ప్రత్యేక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు. మెరిట్ విద్యార్థులకు కేఆర్ నారాయణన్ స్కాలర్‌షిప్. రాష్ట్రంలో ప్రత్యేకంగా ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు. ర్యాగింగ్‌ను అరికట్టేందుకు ‘సిద్ధార్థన్ యాంటీ ర్యాగింగ్ చట్టం’. క్యాంపస్‌లలో మితిమీరిన రాజకీయ జోక్యాన్ని నియంత్రించడం. రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ‘మిషన్ సముద్ర’ పేరుతో కేరళం తీరప్రాంతాన్ని, నదులను అంతర్జాతీయ స్థాయి మారిటైమ్ హబ్‌గా మార్చడం.
పేద కుటుంబాలపై సంక్షేమ వరాల జల్లు :
ఐదేళ్లలో 5 లక్షల ఇళ్లు నిర్మాణం. వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్. 10,000 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) స్థాపన. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో హై-స్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణం. మత్స్యకారుల అభివృద్ధిని, జీవన ప్రమాణాల పెంపును పరిగణనలోకి తీసుకుని సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక ‘ఫిషరీస్ సబ్ ప్లాన్’. వారు వినియోగించే బోట్లకు కిరోసిన్, ఇంధన సబ్సిడీ. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, పాఠశాల కుక్‌లకు వేతనాల సవరణ. ఆటో రిక్షాలు, టాక్సీలకు ఇంధన సబ్సిడీ. తక్కువ ధరకే వివాహ వేడుకలు జరుపుకునేలా వెడ్డింగ్ ఆడిటోరియంల నిర్మాణం.
Read Also: రికార్డు ధర పలికిన రవివర్మ పెయింటింగ్.. ఎన్ని కోట్లంటే..?
Follow Us On : WhatsApp

