Mobile Popup Ad
Mobile Popup Ad

ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ అనవసర రాజకీయం : ఎమ్మెల్యే కుంభం

కలం, భువనగిరి : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై బీజేపీ నాయకులు అనవసర రాజకీయాలు చేస్తూ.. రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (MLA Kumbam Anil Kumar Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి మేలు చేయని బీజేపీ నేతలు, కేవలం రాజకీయ లబ్ధి కోసమే నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రైస్ మిల్లర్లకు కస్టమ్ మిల్లింగ్ రైస్ ఆర్డర్లు ఇవ్వకుండా బీజేపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కనీస మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని తీసుకోవడంలో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.

గత రెండు పంటలకు సంబంధించిన ధాన్యాన్ని కేంద్రం సకాలంలో తీసుకోకపోవడం వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో నిల్వ చేసేందుకు స్థలం లేని దుస్థితి ఏర్పడిందని ఆయన స్పష్టం చేశారు. గతంలో నల్ల చట్టాలు తీసుకువచ్చి దేశవ్యాప్తంగా రైతులను ఇబ్బంది పెట్టిన చరిత్ర బీజేపీదేనని, ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యుల నడుము విరిచింది కేంద్ర ప్రభుత్వం కాదా? అని ఆయన ప్రశ్నించారు. “గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ‘వరి వేస్తే ఉరి’ అని రైతులను భయభ్రాంతులకు గురిచేశారు. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ధాన్యం కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం కొంత ధాన్యం స్టోరేజ్ సమస్య ఉన్నప్పటికీ, మిల్లర్లతో మాట్లాడి ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం” అని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరంతరం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు మేలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదా అని ఆయన నిలదీశారు. హైదరాబాద్‌కు పక్కనే భువనగిరి ఉండటంతో బీజేపీ నాయకులు పదేపదే ఇక్కడికి రావడం తప్ప రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు తక్షణమే ఢిల్లీకి వెళ్లి, తెలంగాణలో వడ్ల కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయనే నిజాన్ని కేంద్రానికి వివరించి, సీఎంఆర్ సేకరణ వేగవంతం అయ్యేలా చూడాలని ఎమ్మెల్యే కుంభం డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>