Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో ఎబోలా కేసులపై కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: ఎబోలా వైరస్‌పై (Ebola Virus) కేంద్రం అప్రమత్తం చేసిన వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఎబోలా కేసులు నమోదు కాలేదని, ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తులను కూడా గుర్తించలేదని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఎబోలా నివారణ, ముందస్తు జాగ్రత్తలు, సన్నద్ధతపై మంత్రి హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్ష చేశారు. ఎబోలా విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉందన్నారు. ప్రజారోగ్య రక్షణ కోసం ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆరోగ్య వ్యవస్థ సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.

శంషాబాద్ ఎయిర్‍‌పోర్టులో తనిఖీలు..

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు కాంగో, ఉగాండా, సౌత్ సూడాన్ వంటి ఎబోలా బాధిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా పెట్టినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ వివరించారు. ఈ నెల 25 నాటికి 58 మంది ప్రయాణికులు ఆయా దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చారని, వీరిలో ఎవరికీ వ్యాధి లక్షణాలు లేవని అధికారులు మంత్రికి తెలిపారు. శంషాబాద్‌ విమానాశ్రయంలోనే స్క్రీనింగ్, థర్మల్ స్కానింగ్ చేస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయంలో డాక్టర్లు, హెల్త్ ఇన్‌స్పెక్టర్లు, ఫీల్డ్ స్టాఫ్, పారామెడికల్ సిబ్బందితో ప్రత్యేక బృందం విధులు నిర్వహిస్తోందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం 108 అంబులెన్స్‌‌లను 24 గంటలపాటు అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు.

గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు..

గాంధీ ఆసుపత్రిలో ముందు జాగ్రత్త చర్యగా 10 పడకల ప్రత్యేక ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశామని మంత్రి దామోదర రాజనర్సింహ వివరించారు. జనరల్ మెడిసిన్ హెచ్‌వోడీ, డాక్టర్‌ సునీల్ కుమార్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించామని తెలిపారు. అనుమానితుల శాంపిల్స్ టెస్ట్ చేసేందుకు పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకు శాంపిల్స్ పంపించనున్నారు‌. ఎబోలా వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చిన వ్యక్తులకు లక్షణాలు లేకపోయినా 21 రోజుల పాటు ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచుతున్నామని అధికారులు మంత్రికి వివరించారు. వీరిపై జిల్లా నిఘా బృందాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ఈ సమీక్షలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>