కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ పోలీస్ కమిషనర్ (Karimnagar CP) గౌష్ ఆలం మంగళవారం జమ్మికుంట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తెలంగాణ పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన CCTNS – 2.0, TS-COP, ఈ-సాక్ష్య, సైబర్ క్రైమ్ టూల్స్, బాడీ వార్న్ కెమెరాల వంటి ఆధునిక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లపై సిబ్బంది పూర్తి పట్టు సాధించాలని సీపీ సూచించారు. అలాగే, రోజువారీ విధుల్లో వాటిని విరివిగా ఉపయోగించాలని ఆదేశించారు. స్టేషన్‌లోని రికార్డులు, ఎఫ్.ఐ.ఆర్ ఇండెక్స్ పరిశీలించి, పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. జమ్మికుంట పరిధిలోని గ్రామాలను సెక్టార్లు, సబ్-సెక్టార్లుగా విభజించి గ్రామ పోలీస్ అధికారులను కేటాయించాలన్నారు. సైబర్ నేరాలపై అవగాహన పెంచాలని, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. రిసెప్షన్, పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను సక్రమంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో జమ్మికుంట టౌన్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, రూరల్ ఇన్‌స్పెక్టర్ వెంకట్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
చెక్ పోస్టులు తనిఖీ చేసిన సీపీ..
జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన పోలీస్ చెక్‌పోస్టులను కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తనిఖీ చేశారు. నాగంపేట, కోరపల్లి గ్రామ శివార్లలో తనిఖీ కేంద్రాలను సందర్శించి రికార్డులను పరిశీలించి భద్రతా చర్యలను సమీక్షించారు. జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇసుక అక్రమ రవాణా జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. చట్టాన్ని అతిక్రమించి అక్రమంగా ఇసుకను తరలించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సీపీ వెంట సీఐలు రామకృష్ణ, వెంకట్ ఉన్నారు.

