కలం, మెదక్ బ్యూరో: దుబ్బాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Kotha Prabhakar Reddy) అన్నారు. రోడ్లు, మున్సిపల్ అభివృద్ధి, విద్యా రంగ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిని కలిసి నిధులు మంజూరు చేయిస్తున్నానని తెలిపారు. దుబ్బాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్మీట్ నిర్వహించారు.
దుబ్బాకకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ పాఠశాల ద్వారా విద్యార్థులకు మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందేలా ప్రతి ఒక్కరి సహకారంతో ముందుకు సాగుతామని తెలిపారు.
రైతులకు సరిపడా యూరియా..
వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నీటి పారుదల కాలువలు, తాగునీటి వనరులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సూచించారు. రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని రైతులను కోరారు.
దుబ్బాక పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఎమ్మెల్యే వివరించారు. మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పరిశుభ్రతను మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

