కలం, నిర్మల్: రానున్న గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) సూచించారు. గురువారం సోన్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె స్టేషన్లోని రికార్డులు, పెండింగ్ కేసులు, బెయిల్ కేసుల నిర్వహణ, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం స్టేషన్ పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ ప్రతి ఫిర్యాదును చట్టప్రకారం సత్వరమే పరిష్కరించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా భక్తుల భద్రత కోసం ప్రత్యేక పోలీసు మానిటరింగ్ టవర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
అంతకుముందు వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన ఎస్పీ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహించే పోలీసులు తమ వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపైనా శ్రద్ధ చూపాలని సూచించారు. ఈ తనిఖీలో డీఎస్పీ శ్రీనివాస్, సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్సై గోపి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

