కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన సీనియర్ కార్యకర్త సూరం కొమురయ్య (Sooram Komurayya) అనారోగ్యంతో మృతి చెందడం సీపీఐ పార్టీకి, వారి కుటుంబానికి తీరని లోటు అని ఆ పార్టీ మండల కార్యదర్శి నాగెల్లి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం రేకొండలో తమ పార్టీ నేతలతో కలిసి లక్ష్మారెడ్డి.. సూరం కొమురయ్య మృతదేహంపై ఎర్రజెండా కప్పి నివాళ్ళర్పించారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. సూరం కొమురయ్య భారత కమ్యూనిస్టు పార్టీలో చేరినప్పటి నుండి తుది శ్వాస విడిచే వరకు పార్టీ పట్ల అంకిత భావంతో ఉన్నాడని, గ్రామంలో ఎవరెన్ని పార్టీలు మారినా ఆయన మాత్రం మారలేదని, వారి కుటుంబం అంతా సీపీఐలో ఉన్నారని అన్నారు. ప్రజా సమస్యలపై సీపీఐ నిర్వహించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడని గుర్తు చేశారు. పార్టీ బలోపేతం కోసం గ్రామంలో కృషి చేశాడని, మంచి కార్యకర్త కొమురయ్య మృతి చెందడం బాధాకరమని చెప్పారు. ఆయన మృతి పట్ల సీపీఐ మండల సమితి తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తూ, వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కౌన్సిల్ సభ్యులు చాడ శ్రీధర్ రెడ్డి, బోయిని వల్లభాయ్ పటేల్, తేరాల సత్యనారాయణ, ముద్రకొల రాజయ్య, నాయకులు తమ్మిశెట్టి రవీందర్, విలాసాగరం అంజయ్య, అయిలయ్య, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

