Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి.. కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, కరీంనగర్ బ్యూరో: జిల్లాలో లోటు వర్షపాతం నమోదవుతున్నందున, ఎల్ నినో ప్రభావం చూపే అవకాశం ఉన్నందున వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Karimnagar Collector Chitra Mishra) వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం, వానాకాలం సాగు, తదుపరి కార్యాచరణ అంశంపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వ్యవసాయ, నీటిపారుదల తదితర శాఖల అధికారులతో మాట్లాడారు.

కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు లోటు వర్షపాతం ఉందని, ఎల్ నినో ప్రభావం (El Nino Impact) కూడా కనిపిస్తున్నందున రైతులకు ప్రత్యామ్నాయ పంటల (Alternative Crops)పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. రైతు వేదికల్లో వ్యవసాయ అధికారులు సమావేశాలు నిర్వహించి రైతులకు సూచనలు అందించాలన్నారు. ఆరుతడి పంటలు, పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు వంటి పంటల సాగు ఆవశ్యకత తెలియజేయాలని ఆదేశించారు. దీనివల్ల ఎల్ నినో ప్రభావాన్ని కొంతమేర అధికమించవచ్చని, రైతులకు నష్టం జరగకుండా ఉంటుందని సూచించారు. జిల్లాలో బావులు, బోరుబావుల ద్వారా కూడా ఎక్కువ మొత్తంలో పంటలు సాగు అవుతున్నందున, ఆరుతడి పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, తక్కువ నీటితో పంట చేతికి వస్తుందని అన్నారు.

ఎరువుల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు..

ఆన్లైన్ ద్వారా యూరియా అమ్మకాల ప్రక్రియ కొనసాగుతున్నందున జిల్లాలో ఎరువుల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులూ ఉండబోవని అన్నారు. యూరియా అమ్మకాల ప్రక్రియను వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్న వడ్లను మాత్రమే సాగు చేయాలని, తద్వారా బోనస్ పొందవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ రకాలను ప్రతి రైతుకు తెలియజేయాలని అన్నారు. ప్రతి రైతు వేదికను ఉపయోగించుకొని స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో రైతులకు వానాకాలం వ్యవసాయానికి సంబంధించిన ప్రతి సూచన తెలియజేయాలన్నారు.

పక్కా ప్రణాళికతో వెళ్ళాలి..

నీటిపారుదల శాఖ అధికారులు నీటి లభ్యత, విడుదల తదితర అంశాలపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని, వ్యవసాయ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో రైతు శ్రేయస్సు కోసం పనిచేయాలని తెలిపారు.వ్యవసాయ శాఖ ద్వారా ప్రతి రైతుకు సాంకేతిక సలహాలు, వాతావరణ సూచన, పంటల ఎంపికపై మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు మండలాల వారీగా సమీక్షిస్తానని తెలిపారు. అధికారుల సూచనలు రైతులు పాటించాలని, ఎలాంటి వదంతులను నమ్మవద్దని కోరారు.

ఎల్ నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని వివరించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు నిత్యం అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. వీబిజిరామ్ జి పథకం అమలుకు సరైన ప్రణాళిక రూపొందించి కూలీలకు వీలైనన్ని ఎక్కువ పని దినాలు కల్పించాలని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>