కలం, నిజామాబాద్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు అమ్మ పేరుతో మొక్కలు నాటాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal) పిలుపునిచ్చారు. ప్రధానిగా మోదీ 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ లోని ప్రభుత్వాసుపత్రిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
మొక్కలు నాటడం అంటే రాబోయే తరాలకు ఇచ్చే గొప్ప ఆస్తి అని చెప్పారు. పర్యావరణాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని గుర్తు చేశారు. మిషన్ లైఫ్ పేరుతో ప్లాస్టిక్ వాడకం తగ్గించడం, నీటి సంరక్షణపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పాఠశాలలు కళాశాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటడం విరివిగా కొనసాగుతుందన్నారు. ప్రధాని మోదీ ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగమోహన్, బిజెపి రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, కార్పొరేటర్ లు నాగోల్ల లక్ష్మీనారాయణ, బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, డాక్టర్ హరీష్ స్వామి, డాక్టర్ రాఘవేంద్ర చిద్రావార్, నాయకులు మాయావార్ కృష్ణ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

