కలం, కరీంనగర్ బ్యూరో: చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని పెద్దపల్లి (Peddapalli) ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు భరోసా ఇచ్చారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి రోడ్డులో ఉన్న రైస్ మిల్లు గోదాంలో నిల్వచేసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెద్దపల్లి నియోజకవర్గంలోని కొనుగోలు సెంటర్లలో ఉన్న వరి ధాన్యం 98 శాతం తరలించామని చెప్పారు. పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో లారీల జాప్యం, హమాలీల కొరతతో కొంతమేర జాప్యం జరిగిందని చెప్పుకొచ్చారు.
లారీ అసోసియేషన్ సభ్యులతో చర్చలు
పెద్దపల్లి, సుల్తానాబాద్ లారీ అసోసియేషన్ అధ్యక్షులు భారీ, తిరుపతి, శ్రీనివాస్, సతీశ్‌లతో మాట్లాడి పెద్దపల్లి, సుల్తానాబాద్ సీఐ ప్రవీణ్, రంజిత్ ఎస్సైలు పోలీసులు, అధికారుల సహకారంతో పూర్తిస్థాయిలో తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హమాలీల కొరత లేకుండా కొంతమంది హమాలీలతో మాట్లాడామని చెప్పారు. రెండు మూడు రోజులలో ధాన్యాన్ని లిఫ్ట్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
రెండ్రోజుల్లో ఆ ధాన్యం లిఫ్ట్ చేస్తాం
పెద్దపల్లి, కాల్వ శ్రీరాంపూర్, ఓదెల, జూలపల్లిలలో అక్కడక్కడ కొన్నిచోట్ల మిగిలిపోయిన ధాన్యాన్ని రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో లిఫ్ట్ చేస్తామని తెలిపారు. కేరళకు రుతుపవనాలు తాకాయని వార్తలు వస్తున్నాయని.. త్వరితగతిన ధాన్యాన్ని తరలిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మొక్కజొన్న ధాన్యాన్ని సైతం నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇప్పటివరకు రైతుల ఖాతాల్లో నాలుగు కోట్ల రూపాయలు జమ అయ్యాయని, మిగిలిన రూపాయలు సైతం త్వరలోనే రైతుల ఖాతాలో జమ కానున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, పలు గ్రామాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

