కలం, క్రైమ్ బ్యూరో : హైదరాబాద్ (Hyderabad) నగరంలో స్పా సెంటర్లు (Spa Centers) గలీజ్ దందాలకు అడ్డాగా మారుతున్నాయి. నగరంలోని పలు స్పా సెంటర్ల నిర్వాహకులు ఇతర రాష్ట్రాల నుంచి యువతులను నగరానికి తీసుకువచ్చి గలీజ్ దందాలోకి దించుతున్నారు. ఈ క్రమంలో స్పా సెంటర్ల ముసుగులో సాగుతున్న అసాంఘిక దందాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
113 స్పా సెంటర్లలో సోదాలు..
మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో పలు స్పా సెంటర్లపై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సుమారు 500 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి పలు స్పా సెంటర్లో శుక్రవారం దాడులు నిర్వహించారు. 113 స్పా సెంటర్లలో పోలీసులు ఏకకాలంలో సోదాలు నిర్వహించి గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న అసాంఘిక కార్యకలాపాలను గుట్టురట్టు చేశారు. పలు స్పా సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు 46 అక్రమ స్పా సెంటర్లపై కేసులు నమోదు చేశారు. మల్కాజ్గిరి కమిషనరేట్ కు చెందిన పోలీసులతో పాటు ఎస్ఓటీ పోలీసులు సోదాలు చేపట్టాయి.
ఎల్బీనగర్ జోన్ పరిధిలో 47 స్పా సెంటర్లలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న 17 స్పా సెంటర్లపై (Spa Centers) కేసులు నమోదు చేశారు. ఉప్పల్ జోన్ పరిధిలో 11, మల్కాజ్గిరి డివిజన్ 1 పరిధిలో 7, మల్కాజ్గిరి డివిజన్ – II పరిధిలో 11 స్పా సెంటర్స్‌పై కేసులు నమోదు చేశారు.
పలు స్పా సెంటర్స్‌లో గలీజ్ దందా
సోదాల్లో భాగంగా పలు స్పా సెంటర్లలో క్రాస్ మసాజ్ పేరిట అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అనేక స్పా సెంటర్ల నిర్వాహకులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, నిబంధనలను పాటించకుండా అక్రమంగా స్పా సెంటర్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. కస్టమర్లకు సంబంధించిన డేటా రిజిస్టర్‌ను సైతం స్పా సెంటర్ నిర్వాహకులు మెయింటెయిన్ చేయడం లేదని పోలీసులు నిర్ధారించారు. కొన్ని స్పా సెంటర్లు సరైన బోర్డులు లేకుండా సెంటర్లు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Read Also: ఉదండాపూర్ రిజర్వాయర్‌ను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Sharechat

