Mobile Popup Ad
Mobile Popup Ad

మిర్యాలగూడలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు సిద్ధం: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

కలం, మిర్యాలగూడ: గత పదేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించిందని మిర్యాలగూడ (Miryalaguda) ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (Bathula Laxma Reddy) ప్రకటించారు. త్వరలోనే రాష్ట్ర మంత్రుల సమక్షంలో అర్హులైన లబ్ధిదారులకు ఈ ఇళ్లను అధికారికంగా పంపిణీ చేస్తామని ఆయ‌న వెల్ల‌డించారు. మంగళవారం ఆయన అధికారులతో కలిసి ఇళ్ల సముదాయాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి, మౌలిక వసతుల ఏర్పాట్లను సమీక్షించారు. మిర్యాలగూడ పట్టణంలో గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులను పూర్తి చేయడమే కాకుండా, అక్కడ నివసించడానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించింద‌న్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సంబంధిత ప్రభుత్వ అధికారులతో కలిసి ఇళ్ల సముదాయాన్ని స్వయంగా పరిశీలించారు.

లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్, తాగునీరు, అంతర్గత రోడ్లు వంటి పనులను అధికారులు నాణ్యతతో పూర్తి చేయడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో రాజీవ్ గృహ కల్ప పథకం కింద మంజూరైన ఈ స్థలంలో గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్ల నిర్మాణం పేరుతో ప‌దేళ్లలో మూడుసార్లు ప్రత్యేక నిధులను మంజూరు చేయించిందని గుర్తు చేశారు. అయినప్పటికీ పనులు పూర్తి చేయకుండా, ఈ ఇళ్లను కేవలం పేదలకు చూపిస్తూ రాజకీయం చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు కనీసం తాగునీరు, రోడ్డు, విద్యుత్ లాంటి కనీస సదుపాయాలు కూడా కల్పించకుండా, కేవలం ఓట్ల కోసం డ్రా సిస్టమ్ పెట్టి ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు.

ఇక కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన గత 6 నెలలుగా ఈ ప్రాజెక్టుపై నిత్యం పర్యవేక్షణ పెట్టామ‌న్నారు. రాష్ట్ర మంత్రులు, అధికారుల సహకారంతో ప్రత్యేక నిధులను మంజూరు చేయించి, ఇక్కడ నివసించడానికి కావాల్సిన అన్ని మౌలిక వసతులను పూర్తి చేయించామ‌న్నారు. పేద ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యమ‌ని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా త్వరలోనే రాష్ట్ర మంత్రుల ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు పూర్తి పారదర్శకంగా ఈ ఇళ్లను అందజేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రటరీ చిలుకూరి బాలకృష్ణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుడిపాటి నవీన్, జాతీయ మాల మహానాడు అధ్యక్షులు తాళ్లపల్లి రవి, సర్పంచ్ బెజ్జం సైదులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>