కలం, వెబ్ డెస్క్ : తిరుపతి (Tirupati) జిల్లా భాకరపేట (Bhakarapeta) ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం తృటిలో తప్పింది. కలకడ నుంచి తిరుపతికి వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రక్షణ గోడను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 48 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు వేగంగా వస్తూ ఒక్కసారిగా అదుపు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే రోడ్డు పక్కన ఉన్న గోడ అడ్డుగా నిలవడంతో బస్సు లోయలో పడకుండా అక్కడే ఆగిపోయింది. దీంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసే చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో భాకరాపేట ఘాట్ రోడ్డులో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

